కేపీఎల్‌ కథ...

8 Nov, 2019 06:02 IST|Sakshi

ఐపీఎల్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో లీగ్‌ నిర్వహించుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చిన తొలి టోర్నీ. 2009లో మొదలైంది. ముందుగా ఎనిమిది జట్లతో మొదలైనా ప్రస్తుతం 7 టీమ్‌లు ఉన్నాయి. భారత్‌కు ఆడిన కర్ణాటక అగ్రశ్రేణి క్రికెటర్లంతా పాల్గొంటుండటంతో లీగ్‌పై అందరి దృష్టీ పడింది. భారీ స్పాన్సర్‌షిప్‌లు, టీవీ రేటింగ్స్‌ కూడా బాగా వచ్చాయి. డీన్‌ జోన్స్, బ్రెట్‌లీలాంటి స్టార్లు కామెంటేటర్లుగా వ్యవహరించారు. ఒక దశలో ఆకర్షణ కోసమంటూ కన్నడ సినీ, టీవీ ఆర్టిస్టులతో కూడిన ‘రాక్‌స్టార్స్‌’ అనే టీమ్‌ను కూడా లీగ్‌ బరిలోకి దించారు. కేపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగానే కరియప్ప, శివిల్‌ కౌశిక్‌లాంటి క్రికెటర్లకు ఐపీఎల్‌ అవకాశం దక్కింది. ఈ లీగ్‌కు వివాదాలు కొత్త కాదు. 2011లో టోర్నీ నిర్వహణా తీరును సందేహిస్తూ కుంబ్లే, శ్రీనాథ్‌లాంటి దిగ్గజాలు విమర్శించారు. వీరిద్దరు కర్ణాటక క్రికెట్‌ సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికైన తర్వాత మూడేళ్ల పాటు లీగ్‌ను నిర్వహించకుండా నిలిపివేశారు. అయితే కుంబ్లే, శ్రీనాథ్‌ పదవులనుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ కేపీఎల్‌ ప్రాణం పోసుకుంది.

మరిన్ని వార్తలు