నియమావళిని సవరిస్తాం

30 Mar, 2018 05:03 IST|Sakshi

ఐసీసీ సీఈఓ రిచర్డ్‌సన్‌

న్యూఢిల్లీ: ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిలో సవరణలు చేపడతామని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సీఈఓ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ వెల్లడించారు. బాల్‌ ట్యాంపరింగ్, శ్రుతిమించిన స్లెడ్జింగ్‌లాంటి వ్యవహారాలను సీరియస్‌గా తీసుకుంటామని, కఠిన చర్యలకు ఊతమిచ్చేలా నియమావళిని మారుస్తామని ఆయన చెప్పారు. ‘త్వరలోనే మార్పులకు శ్రీకారం చుడతాం. నియమావళికి చెప్పుకోదగ్గ సవరణలు తీసుకొస్తాం.

దీని వల్ల జరిగిన తప్పిదాలకు తగిన శిక్షలు వేసే ఆస్కారం ఉంటుంది. దీంతో తీవ్రమైన తప్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు’ అని అన్నారు.  ఫుట్‌బాల్‌లో ఉన్నట్లు ఎల్లో, రెడ్‌ కార్డులను క్రికెట్‌లోనూ ప్రవేశపెడితే వచ్చే ప్రయోజనమేమీ తనకు కనబడటం లేదన్నారు. ‘ఇదివరకే దీనిపై ఐసీసీ చర్చించింది కూడా! మళ్లీ మరోసారి చర్చించాల్సిన అవసరముంది. అయితే ఈ కార్డులతో పరిస్థితిలో మార్పుంటుందని నేననుకోవడం లేదు’ అని రిచర్డ్‌సన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు