బ్రాడ్‌ ఓవరాక్షన్‌.. మ్యాచ్‌ ఫీజులో కోత

22 Aug, 2018 11:44 IST|Sakshi
స్టువర్ట్‌ బ్రాడ్‌

నాటింగ్‌హామ్ ‌: ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌కు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) జరిమానా విధించింది. భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో బౌలర్‌ బ్రాడ్‌ ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీ మెరిట్‌ పాయింట్‌ ఇచ్చారు. బ్యాట్స్‌మన్‌ ఔటైనప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ, అసభ్య సంకేతాలతో ఎగతాళి చేస్తే ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్‌ 2.1.7 ప్రకారం తప్పిదంగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే.

టెంట్‌బ్రిడ్జ్‌ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌ 92వ ఓవర్‌లో అరంగేట్ర క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. తన బౌలింగ్‌లో అవుటై నిరాశగా వెనుదిరుగుతున్న పంత్‌ను ఉద్దేశించి స్టువర్ట్‌ బ్రాడ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇది గమనించిన రిఫరీ జెఫ్‌ క్రో, ఐసీసీ అధికారులు విచారణ చేపట్టి ప్రశ్నించగా.. వ్యాఖ్యలు చేయడం తన తప్పిదమేనని బ్రాడ్‌ అంగీకరించాడు. రిఫరీ అతడిని మందలించడంతో పాటు మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు.

మరోవైపు ఈ మూడో టెస్టులో విజయానికి భారత్‌ మరో వికెట్‌ దూరంలో నిలిచింది. నేడు ఇంగ్లండ్‌ చివరి వికెట్‌ తీసి సిరీస్‌లో ఆతిథ్య జట్టు ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాలని విరాట్‌ కోహ్లి సేన భావిస్తోంది. తొలి టెస్టులో విజయం ముంగిట భారత్‌ చతికిల పడగా, రెండో టెస్ట్‌ లార్డ్స్‌లో మాత్రం జట్టు సమష్టిగా విఫలమై మూల్యం చెల్లించుకుంది.

విజయానికి వికెట్‌ దూరంలో టీమిండియా...

>
మరిన్ని వార్తలు