భవిష్యత్‌ హాకీ స్టార్‌ జ్యోతిరెడ్డి

7 May, 2019 15:12 IST|Sakshi

  జాతీయస్థాయి ప్లేయర్‌గా ఎదిగిన నగర క్రీడాకారిణి

  ఆటతో పాటు చదువుల్లోనూ రాణిస్తున్న వైనం

  పదిలో 9.8 జీపీఏ...ఇంటర్‌లో 891 మార్కులు

  ప్రస్తుతం భోపాల్‌ ‘సాయ్‌’లో శిక్షణ

హైదరాబాద్‌: జాతీయ క్రీడ హాకీలో తెలంగాణ రాష్ట్ర క్రీడాకారిణి ఈదుల జ్యోతిరెడ్డి అదరగొడుతోంది. ఆటతో పాటు చదువుల్లోనూ సత్తా చాటుతూ తన ప్రతిభను కనబరుస్తోంది. ఈదుల శివనాగిరెడ్డి, వెంకటలక్ష్మీ దంపతుల కుమార్తె జ్యోతిరెడ్డి చిన్నతనం నుంచే అన్ని రకాల ఆటల్లో ఉత్సాహంతో పాల్గొనేది. ఊహ తెలిసిన నాటి నుంచి హాకీపై మక్కువ పెంచుకున్న ఆమెను కోచ్‌ రాంబాబు ప్రోత్సహించారు. కోచ్‌తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో జ్యోతి జాతీయస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. హాకీలో ఆమె ప్రతిభను గుర్తించిన భోపాల్‌ ‘సాయ్‌’ ప్రతినిధులు ఆమెను భారత స్పోర్ట్స్‌ అథారిటీ సెంటర్‌లో చేర్చుకొని మెరుగైన శిక్షణను అందిస్తున్నారు.
 
హాకీలో ఎదిగిన తీరు...  

జ్యోతి తల్లిదండ్రులు మూడు దశాబ్దాల క్రితమే కడప నుంచి ఇక్కడికి వలస వచ్చారు. గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లో స్థిరపడ్డారు. ఇక్కడే జన్మించిన జ్యోతి పాఠశాల స్థాయి నుంచి హాకీలో రాణించింది. 2012 నుంచి 2014 వరకు రంగారెడ్డి జిల్లా హాకీ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆమె రాష్ట్ర స్థాయిలో ఎన్నో విజయాలను అందించింది. 2015లో రాంచీలో జరిగిన జాతీయ స్థాయి హాకీ టోర్నీలో జ్యోతి తెలంగాణ రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. 2016లో భోపాల్‌ ‘సాయ్‌’ సెంటర్‌కు ఎంపికైన ఆమె ఇప్పటికీ అక్కడే ఉంటూ మెరుగైన శిక్షణను పొందుతోంది. ఇక్కడ శిక్షణ పొందుతోన్న సమయంలోనే సబ్‌ జూనియర్‌ స్థాయిలో ‘ఉత్తమ ప్లేయర్‌’ అవార్డును అందుకుంది. తర్వాత పలు జాతీయ స్థాయి టోర్నీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె... 2018 భోపాల్‌లో జరిగిన ఆలిండియా రాజమాత సింధియా గోల్డ్‌ కప్‌లో సెమీస్‌కు చేరిన జట్టులో సభ్యురాలు కూడా. ఈ ఏడాది జనవరిలో కేరళ వేదికగా జరిగిన జూనియర్‌ నేషనల్‌ హాకీ టోర్నీలో పాల్గొన్న జ్యోతి మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంది.  

చదువుల్లోనూ మేటి...

ఓ వైపు హాకీలో రాణిస్తున్న జ్యోతిరెడ్డి చదువుల్లోనూ గొప్ప ప్రతిభ కనబరుస్తోంది. గచ్చిబౌలి జీపీఆర్‌ఏ క్వార్టర్స్‌లోని కేంద్రీయ విద్యాలయలో పదో తరగతి వరకు చదివిన ఆమె 9.8 జీపీఏ సాధించడం విశేషం. ఇటీవల ప్రకటించిన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లోనూ జ్యోతి సత్తా చాటింది. గచ్చిబౌలి డివిజన్‌ మధురానగర్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివిన జ్యోతి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 891 మార్కులు సాధించి ఔరా అనిపించింది. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రత్యేక చొరవతోనే తాను చదువుల్లో రాణిస్తున్నానని జ్యోతి పేర్కొంది.  

భారత హాకీ జట్టుకు ఆడటమే లక్ష్యం...

‘చిన్నప్పటి నుంచి హాకీని శ్రద్ధగా నేర్చుకున్నాను. జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగాను. ప్రస్తుతం నా లక్ష్యం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం. భోపాల్‌లోని ‘సాయ్‌’లో చేరడంతో ఆటలో నాణ్యత పెరిగింది. కోచ్‌ రాంబాబు కారణంగానే ఈ స్థాయికి రాగలిగాను. కేవీ ఉపాధ్యాయులు, రాయదుర్గం జూనియర్‌ కాలేజి లెక్చరర్ల ప్రోత్సాహంతో చదువులోనే రాణించగలుగుతున్నా. నచ్చిన క్రీడను ఎంపిక చేసుకుంటే ఆటతో పాటు చదువుల్లోనూ రాణించగలం’.   
–జ్యోతిరెడ్డి, హాకీ క్రీడాకారిణి

మరిన్ని వార్తలు