క్రికెట్‌కు 'పునర్జన్మ'

14 Jul, 2020 00:09 IST|Sakshi

విజయవంతంగా ముగిసిన ఇంగ్లండ్‌–వెస్టిండీస్‌ టెస్టు

‘బయో బబుల్‌’ వాతావరణంలో సాఫీగా సాగిన మ్యాచ్‌

కరోనా సమయంలో ఇతర జట్లకు మార్గనిర్దేశనం

‘వాస్తవికంగా ఆలోచిస్తే నా దృష్టిలో బయో బబుల్‌ వాతావరణంలో టెస్టు మ్యాచ్‌ నిర్వహించడం సాధ్యం కాదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆట మధ్యలో ఎవరికైనా కరోనా సోకినట్లు తెలిస్తే ఏం చేస్తారు. మ్యాచ్‌ను మధ్యలో రద్దు చేస్తారా’... కొద్ది రోజుల క్రితం భారత మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చేసిన వ్యాఖ్య ఇది. అయితే ఇప్పుడు దీనిని తప్పుగా నిరూపిస్తూ వెస్టిండీస్‌తో తొలి టెస్టును ఇంగ్లండ్‌ ఘనంగా నిర్వహించింది. కరోనా ప్రమాద సమయంలో అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ తొలి అడుగును విజయవంతంగా వేసింది. అయితే ఇంగ్లండ్‌ బోర్డు సాహసం ఇతర దేశాలకు కూడా స్ఫూర్తినిస్తుందా? ఆ దేశం తరహాలో ఇతర బోర్డులు కూడా నిర్వహించడం సాధ్యమేనా? వేచి చూడాలి!

సాక్షి క్రీడా విభాగం: స్టేడియం పరిసరాల్లో ఎంపిక చేసిన కొద్ది మందికే ప్రవేశం, వారికి మళ్లీ మళ్లీ కోవిడ్‌–19 పరీక్షలు, సోషల్‌ డిస్టెన్సింగ్, ప్రతీ రోజు ఆటగాళ్ల హెల్త్‌ రిపోర్ట్‌లు, బౌండరీ వద్ద శానిటైజర్లు, ఆడేటప్పుడు మినహా ప్రతీ సమయంలో మాస్క్‌లు తప్పనిసరి... ఇలా కొత్త కొత్త నిబంధనల మధ్య సౌతాంప్టన్‌లో ఇంగ్లండ్, విండీస్‌ ఆటగాళ్లు తలపడ్డారు. ఇతరులు ఎవరికీ ప్రవేశం లేకుండా తమ చుట్టూ ఒక వలయం ఏర్పరచుకొని (బయో బబుల్‌) ఒక సైన్స్‌ ఫిక్షన్‌ సినిమా తరహాలో ఉన్నట్లు క్రికెటర్లు తమ పరిధిలో తొలి టెస్టు ఆడారు. మైదానంలో ప్రేక్షకులు లేకపోవడమే నిరాశ తప్ప అదృష్టవశాత్తూ ఆటగాళ్ల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఆందోళనకరమైన ఘటనలూ జరగలేదు. ఇదే జోరుతో మిగిలిన రెండు టెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది.  

ఇంగ్లండ్‌ తప్పనిసరి పరిస్థితుల్లో... 
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ తర్వాత పాకిస్తాన్‌తో కూడా ఇదే తరహాలో ఇంగ్లండ్‌ స్వదేశంలో సిరీస్‌ ఆడనుంది. ఇప్పటికే పాక్‌ జట్టు ఇంగ్లండ్‌లో ప్రాక్టీస్‌ చేస్తుండగా, ఏర్పాట్లన్నీ కోవిడ్‌–19 నిబంధనల ప్రకారమే పూర్తయ్యాయి కూడా. అంతర్జాతీయ జట్లను చూస్తే ఇంగ్లండ్‌కు ప్రస్తుత జూలై–ఆగస్టు అసలైన క్రికెట్‌ సీజన్‌. దీన్ని చేజార్చుకుంటే ఇంగ్లండ్‌ బోర్డు ఆర్థికపరంగా భారీ నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో కరోనా వ్యాప్తి ఉన్నా సరే...  ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉన్న విండీస్, పాక్‌ బోర్డులకు ఆశ చూపి ఇంగ్లండ్‌ సిరీస్‌లు ఆడిస్తోంది. సమర్థ నిర్వహణలో ప్రసారకర్తలు స్కై న్యూస్‌ పాత్ర కూడా ఇందులో చాలా ఉంది.

ఇంగ్లండ్‌–విండీస్‌ సిరీస్‌ ముగిసిన తర్వాతే బయో బబుల్‌ వాతావరణంపై ఒక అంచనాకు రాగలమని క్రికెట్‌ విశ్లేషకులు భావించారు. ప్రస్తుతానికి ఇతర బోర్డులేవీ ఈ తరహా ఆలోచనతో ఉన్నట్లు కనిపించడం లేదు. అదనపు ఖర్చుతోపాటు అదంతా ఎంతో ఓర్పు, శ్రమతో కూడుకున్న వ్యవహారంగా ఎక్కువ దేశాలు భావిస్తున్నాయి. ఇంగ్లండ్‌కు సరి జోడిలాంటి ఆస్ట్రేలియా బోర్డు కూడా దీనిపై తొందరపడటం లేదు. ఎక్కువ జట్లతో ఇది సాధ్యం కాదు కాబట్టి ఆ దేశం టి20 ప్రపంచకప్‌ను వాయిదా వేయించేందుకే ఆసక్తి చూపించింది. ఆదాయం తెచ్చి పెట్టగలిగే భారత్‌ సిరీస్‌కు మాత్రం అలా ఆలోచిస్తోంది కానీ దానికి ఇంకా చాలా సమయముంది. దక్షిణాఫ్రికా బోర్డు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభంలో వారికి ఇది సాధ్యమే కాదు.  

తేడా కనిపించిందా... 
కరోనా సమయంలో జరుగుతున్న క్రికెట్‌లో ప్రధానంగా బంతిపై సలైవా (ఉమ్ము)  వాడటంపై చాలా చర్చ జరిగింది. అయితే సౌతాంప్టన్‌ టెస్టు తర్వాత చూస్తే దాని ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఏ బౌలర్‌ కూడా సలైవా లేకపోవడం వల్ల తాను స్వింగ్‌ చేయడానికి ఇబ్బంది పడినట్లు చెప్పలేదు. బహిరంగంగా కూడా తన అసంతృప్తిని ప్రదర్శించలేదు కాబట్టి అది సమస్య కాదనే ప్రస్తుతానికి అనుకోవచ్చు. అయితే అంపైరింగ్‌ తప్పిదాలపై మాత్రం మరోసారి దృష్టి పెట్టాల్సిందే.

కరోనా సమయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఈ టెస్టులో నలుగురు అంపైర్లు కూడా ఇంగ్లండ్‌వారే పని చేశారు. యాదృచ్ఛికమే కావచ్చేమో గానీ మొత్తం 22 రివ్యూలలో 11 రివ్యూలు అంపైర్లు తప్పు చేసినట్లు తేల్చాయి. వీటిలో ఎక్కువ భాగం ఇంగ్లండ్‌కు అనుకూలంగా ఇచ్చినవే. మొత్తంగా చూస్తే కరోనా విరామం తర్వాత జరిగిన తొలి టెస్టు గురించి పెద్దగా ఫిర్యాదులేమీ రాలేదు. కాబట్టి మున్ముందు ఎలా జరగవచ్చో చెప్పలేకపోయినా... ప్రస్తుతానికి క్రికెట్‌ తడబాటు లేకుండా మొదలైనట్లే.

భారత్‌ ఏం చేస్తుందో...
ఇతర దేశాల సంగతి ఎలా ఉన్నా భారత్‌లో మాత్రం ఇప్పటికిప్పుడు క్రికెట్‌ తిరిగి రావడం చాలా కష్టం. దేశంలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకూ తీవ్రంగా పెరిగిపోతున్న సమయంలో క్రికెట్‌ అంటే జనం నుంచే మొదట నిరసన కనిపించవచ్చు. ఐపీఎల్‌పై బోర్డు ఎన్ని ఆశలు పెట్టుకుంటున్నా... అది అంత సులువు కాదు. ఇక ఇంగ్లండ్‌లాగా బయో బబుల్‌ తరహాలో అంటే అసాధ్యమనే చెప్పవచ్చు. గతంలోనే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చెప్పినట్లు కరోనా సమయంలో ఆటల నిర్వహణలో విదేశీ తరహా క్రమశిక్షణను మనం ఇక్కడ ఆశించలేం. చిన్న పొరపాటు ఏ స్థాయిలో జరిగినా అది మొత్తానికే నష్టం కలిగించవచ్చు. ఎలా చూసినా ఆస్ట్రేలియాలోనే భారత్‌ తమ తదుపరి సిరీస్‌ ఆడే అవకాశాలే ఎక్కువ.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా