-

సుధా సింగ్‌కు యూపీ ప్రభుత్వ ఉద్యోగం

29 Aug, 2018 01:33 IST|Sakshi

లక్నో: వెటరన్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ సుధా సింగ్‌కు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వనుంది. 32 ఏళ్ల సుధా... సోమవారం 3 వేల మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో రజతం నెగ్గింది. దీంతో ఆమెకు రూ.30 లక్షల ప్రోత్సాహక నగదుతో పాటు గెజిటెడ్‌ హోదాతో కొలువు ఇవ్వనున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. అయితే, దీనిపై సుధా సింగ్‌ ఒకింత నిర్వేదంతో స్పందించింది. ‘నాకెలాంటి సంతోషమూ, నిరుత్సాహమూ లేదు. 2010 ఏషియాడ్‌లోనే స్వర్ణం గెలిచాను.

ఆసియా చాంపియన్‌షిప్‌లలో కూడా పతకాలు నెగ్గాను. ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్స్‌లోనూ ప్రాతినిధ్యం వహించాను. ఈ ఉద్యోగం ఇంతకుముందే రావాల్సింది. క్రీడా కోటాలో నియామకానికి సంబంధించి నాలుగేళ్లుగా నా ఫైల్‌ అపరిష్కృతంగా ఉంది. అప్పుడు కాకున్నా, ఇప్పుడు ఇవ్వడం కొంతలో కొంత ఉపశమనం. క్రీడా శాఖలో మాత్రమే ఉద్యోగం చేస్తా. ఇతర శాఖల్లో చేయను’ అని పేర్కొంది. సుధా ప్రస్తుతం రైల్వే శాఖ ఉద్యోగి. 2015లో యూపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆమెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం రావాల్సి ఉంది. దీనిపై మూడుసార్లు నాటి సీఎంను కలిసినా ఉపయోగం లేకపోయిందని ఆమె సోదరుడు పర్వేష్‌ తెలిపాడు. 

మరిన్ని వార్తలు