చైనా గోడ దాటుతారా?

26 May, 2017 00:18 IST|Sakshi
చైనా గోడ దాటుతారా?

సుదిర్మన్‌ కప్‌లో నేడు భారత్‌ కీలక పోరు

గోల్డ్‌ కోస్ట్‌: సుదిర్మన్‌ కప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో  నేడు (శుక్రవారం) రసవత్తర పోరు జరగనుంది. నాకౌట్‌ దశలో భాగంగా క్వార్టర్‌ ఫైనల్లో భారత్, చైనా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. డెన్మార్క్‌తో తొలి లీగ్‌ మ్యాచ్‌లో ఓటమి తర్వాత ఇండోనేసియాతో జరిగిన మ్యాచ్‌లో అనూహ్యంగా పుంజుకున్న భారత జట్టు ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగుతోంది. 28 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో టీమిండియా నాకౌట్‌ దశకు అర్హత సాధించడం ఇది రెండోసారి.

2011లో క్వార్టర్స్‌లోనే చైనా చేతిలో 1–3తో భారత్‌కు పరాభవం ఎదురైంది. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే సరైన సమయమని భారత ఆటగాళ్లు భావిస్తున్నారు. ఇండోనేసియాతో పోరులో గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో చైనాపై గెలిచి సంచలన విజయం నమోదు చేయాలని భారత్‌ ఉవ్విళ్లూరుతోంది. అయితే ఇది అంత సులువైన పనేం కాదు. ఒలింపిక్‌ పతక విజేతలు లిన్‌ డాన్, చెన్‌ లాంగ్‌లతో చైనా జట్టు పటిష్టంగా ఉంది. అయితే భారత జట్టులో కిడాంబి శ్రీకాంత్‌కు లిన్‌ డాన్‌పై గెలిచిన అనుభవం ఉంది. మరోసారి శ్రీకాంత్‌ అద్వితీయమైన ఆటతీరును ప్రదర్శిస్తే తప్ప అతన్ని కట్టడి చేయలేం.

మరోవైపు ఇటీవల కాలంలో చైనా క్రీడాకారులపై ఆధిపత్యం చలాయిస్తోన్న సింధు తన దూకుడును కొనసాగించాలి. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నెం. 5 సింధు, హి బింగ్‌ జియావో (ప్రపంచ నెం. 7)తో లేదా సున్‌ యు (ప్రపంచ నెం. 6)తో తలపడే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో బింగ్‌ జియావో చేతిలో సింధు పరాజయం పాలైంది. మరో క్రీడాకారిణి సున్‌ యు (4–3)కు కూడా సింధుపై మెరుగైన రికార్డు ఉంది. దీంతో సింధు మరింత పట్టుదలగా ఆడాల్సి ఉంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీ, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో అశ్విని– సాత్విక్‌ సాయిరాజ్‌ జోడీలు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నాయి. గత మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత పురుషుల డబుల్స్‌ జంట సుమీత్‌ రెడ్డి– మను అత్రి ఈ పోరులో రాణించాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు