‘డ్రా’తో సరిపెట్టుకున్నారు

5 Mar, 2018 04:00 IST|Sakshi

1–1తో ముగిసిన భారత్, ఇంగ్లండ్‌ మ్యాచ్‌

అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీ  

ఇఫో (మలేసియా): సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌ హాకీ టోర్నీలో భారత జట్టు రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంది. ఇంగ్లండ్‌తో ఆదివారం ఇక్కడ జరిగిన పోరులో తుదికంటా ఆధిపత్యం చలాయించిన భారత్‌ చివరకు 1–1తో ‘డ్రా’తో సరిపెట్టుకుంది. గత మ్యాచ్‌లో రియో ఒలింపిక్స్‌ చాంపియన్‌ అర్జెంటీనా చేతిలో 2–3తో ఓటమి పాలైన సర్దార్‌ సింగ్‌ సేన ఈ మ్యాచ్‌లో ఆకట్టుకుంది. శైలానంద్‌ లక్రా (14వ ని.) తొలి అంతర్జాతీయ గోల్‌ చేసి భారత్‌కు ఆధిక్యం అందించగా... డిఫెండర్లు ప్రత్యర్థిని నిలువరించడంతో ఆట 53వ నిమిషం వరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగింది.

మ్యాచ్‌ ముగియడానికి ఏడు నిమిషాల ముందు ఇంగ్లండ్‌కు లభించిన పెనాల్టీ కార్నర్‌ను మార్క్‌ గ్లెగోర్న్‌ గోల్‌గా మలచడంతో స్కోరు 1–1తో సమమైంది. అనంతరం ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా మరో గోల్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 9 పెనాల్టీ కార్నర్‌లు లభించినా వరుణ్‌ కుమార్, అమిత్‌ రొహిదాస్‌ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమయ్యారు. ఆరు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో ఓడి రెండో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లో మంగళవారం ప్రపంచ నంబర్‌వన్‌ ఆస్ట్రేలియాతో ఆడుతుంది.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు