భారత్ శుభారంభం

7 Apr, 2016 00:26 IST|Sakshi
భారత్ శుభారంభం

జపాన్‌పై 2-1తో గెలుపు 
అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ

 
 ఇపో (మలేసియా): మాజీ చాంపియన్ భారత్... సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. జపాన్‌తో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఒకదశలో 0-1తో వెనుకబడిన భారత్ ఆ తర్వాత తేరుకొని ఎనిమిది నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన జపాన్ నుంచి ఆద్యంతం భారత్‌కు గట్టిపోటీ ఎదురైంది. ఆట 17వ నిమిషంలో కెంజి కిటాజాటో గోల్‌తో జపాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌నే జపాన్ గోల్‌గా మలచడం విశేషం. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ప్రత్యర్థి వలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.


24వ నిమిషంలో లభించిన తొలి పెనాల్టీ కార్నర్‌ను కుడి వైపునకు డ్రాగ్ ఫ్లిక్ చేసి హర్మన్‌ప్రీత్ సింగ్ భారత్‌కు మొదటి గోల్‌ను అందించాడు. ఆ తర్వాత ఆట 32వ నిమిషంలో జస్జీత్ సింగ్ అందించిన పాస్‌ను అందుకున్న సర్దార్ సింగ్ రివర్స్ షాట్‌తో జపాన్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. మ్యాచ్ ముగిసేలోపు భారత్‌కు మరిన్ని గోల్స్ చేసే అవకాశాలు లభించినా ఫలితం లేకపోయింది.

సహచర ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో నల్ల రిబ్బన్ బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటలముందు మన్‌ప్రీత్ సింగ్ తండ్రి మృతి చెందినట్లు సమాచారం అందింది. దాంతో మన్‌ప్రీత్ స్వదేశానికి బయలుదేరి వెళ్లాడు. గురువారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది.

మరిన్ని వార్తలు