ఒలింపిక్స్ లో క్రికెటర్ కొత్త చరిత్ర!

22 Aug, 2016 11:43 IST|Sakshi
ఒలింపిక్స్ లో క్రికెటర్ కొత్త చరిత్ర!

రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో ఓ మహిళా క్రికెటర్ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సునీత్ విల్జోయిన్.. తాజా ఒలింపిక్స్లో రజత పతకం గెలిచి కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇటీవల రియోలో జరిగిన జావెలిన్ త్రో ఫైనల్ ఈవెంట్లో రజతాన్ని సాధించింది. దీంతో 96 ఏళ్ల తరువాత ఒలింపిక్స్ లో పతకం సాధించిన రెండో క్రికెటర్ గా గుర్తింపు సాధించింది. ఒలింపిక్స్లో ఒక క్రికెటర్ పతకం సాధించడం ఇది రెండోసారి మాత్రమే. 1920లో బ్రిటన్ హాకీ జట్టు స్వర్ణం సాధించిన జట్టులో సభ్యుడైన జాక్ మెక్ బ్రయాన్ కూడా ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెటర్.

సుమారు శతాబ్దం తరువాత ఆ ఘనతను విల్జోయిస్ అందుకుంది. ఈ 33 ఏళ్ల  విల్జోయిస్.. 2000-02 మధ్య కాలంలో దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఒక అంతర్జాతీయ టెస్టు మ్యాచ్తో పాటు 17 వన్డేలు ఆడింది. ఆ తరువాత తనకిష్టమైన జావెలిన్ త్రోలోకి ప్రవేశించిన విల్జోయిస్.. రియోలో రజతంతో మెరిసింది. గురువారం జరిగిన ఫైనల్ ఈవెంట్లో జావెలిన్ను 64. 92 మీటర్లు విసిరి రజతం సాధించింది.ఈ పోటీలో క్రొయేషియా క్రీడాకారిణి సోరా కోలక్ స్వర్ణం గెలుచుకుంది.
 

>
మరిన్ని వార్తలు