మెస్సీ సరసన సునీల్‌ చెత్రీ...

11 Jun, 2018 11:24 IST|Sakshi

ముంబై: స్వదేశంలో అద్భుత ఫామ్‌ కొనసాగించిన భారత ఫుట్‌బాల్‌ జట్టు ఇంటర్‌ కాంటినెంటల్‌ కప్‌ను చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. కెన్యాతో ఆదివారం జరిగిన ఫైనల్లో కెప్టెన్‌ సునీల్‌ చెత్రీ డబుల్‌ గోల్స్‌ సాయంతో భారత్‌ 2–0తో విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో చెత్రీ అర్జెంటీనా స్టార్‌ మెస్సీ సరసన చేరాడు. ప్రస్తుతం ఫుట్‌బాల్‌ ఆడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక గోల్స్‌ చేసిన రెండో ప్లేయర్‌గా మెస్సీతో జత కట్టాడు. మెస్సీ 124 మ్యాచ్‌ల్లో 64 గోల్స్‌ చేయగా... చెత్రీ 102 మ్యాచ్‌ల్లోనే 64 గోల్స్‌ సాధించాడు. ఈ జాబితాలో పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డో (150 మ్యాచ్‌ల్లో 81 గోల్స్‌) అగ్రస్థానంలో ఉన్నాడు.  

విజయం అభిమానానికి అంకితం..

కెన్యాతో ఫైనల్లో విజయం సాధించి కప్‌ను సొంతం చేసుకోవడంతో సునీల్‌ చెత్రీ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విజయం అభిమానులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. విశేషమైన అభిమానం తమపై చూపెట్టడంతో దక్కిన విజయంగా అభివర్ణించాడు. ఈ మేరకు తమ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లను ఆదరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఈ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలనే విన్నవించాడు.


‘మమ్మల్ని తిట్టండి, విమర్శించండి. కానీ భారత ఫుట్‌బాల్‌ జట్టు ఆడే మ్యాచ్‌లను స్టేడియానికి వచ్చి చూడండి. యూరోపియన్‌ ఫుట్‌బాల్ క్లబ్‌లకు సపోర్ట్ తెలిపే మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఆటలో వారి స్థాయిని మేం అందుకోలేకపోవచ్చు. మా మ్యాచ్‌కు వచ్చి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలని అనిపించొచ్చు. మేం కాదనట్లేదు, ఆ స్థాయిలో మా ఆట లేదనే విషయాన్ని కూడా ఒప్పుకుంటాం. కానీ ఆట పట్ల మా నిబద్ధత, ప్రేమతో మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాం’ అని తొలి మ్యాచ్‌ తర్వాత చెత్రీ ఆవేదన ఇది. చైనీస్‌ తైపీతో జరిగిన మ్యాచ్‌కు ముంబైలోని ఎరీనా స్టేడియం బోసిపోవడంతో చెత‍్రీ తన ఆవేదనతో సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. చెత్రి ఆవేదనను అటు సెలబ్రెటీలతో పాటు అభిమానులు కూడా అర్ధం చేసుకోవడంతో భారత ఆడే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లకు భారీ మద్దతు దక్కింది. ఈ క్రమంలోనే కప్‌ను గెలవడం భారత్ ఫుట్‌బాల్‌లో మరింత జోష్‌ను నింపింది.


 

మరిన్ని వార్తలు