సరైన ఆరంభమే సునీల్‌ గావస్కర్‌

9 Apr, 2018 04:40 IST|Sakshi

చెన్నై సూపర్‌ కింగ్స్‌ పునరాగమనం చిరస్మరణీయం. కఠిన పరిస్థితుల్లోనూ అద్భుతంగా ఆడగల బ్రేవో వంటి అనుభవజ్ఞులతో కూడిన ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఓటమి అంచుల నుంచి సూపర్‌ కింగ్స్‌ సాధించిన విజయంతో ఐపీఎల్‌–11వ సీజన్‌కు సరైన ఆరంభం లభించినట్లయింది. జట్టులో ఆల్‌రౌండర్లు ఉండటం ఎంతటి సౌలభ్యమో బ్రేవో అసాధారణ ఇన్నింగ్స్‌ చెబుతోంది. అంతకుముందు బ్రేవో జిత్తులమారి బౌలింగ్‌తో ప్రత్యర్థి స్కోరు 180కి చేరకుండా నిలువరించాడు.

చివరి ఓవర్లలో అతడి నెమ్మదైన బంతులు, వేగవంతమైన యార్కర్లను ముంబై బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లుగా మలచలేకపోయారు. ఛేదనలో 16వ ఓవర్‌ ముగిసేసరికి చెన్నై దాదాపు 11 రన్‌రేట్‌తో పరుగులు సాధించాల్సి ఉంది. ఈ దశలో బ్రేవో భారీ హిట్టింగ్‌తో ఫలితాన్ని మార్చేశాడు. లీగ్‌లో పునరాగమనం చేస్తున్న మరో జట్టు రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా చెన్నైను చూసి స్ఫూర్తి పొందుతుందనడంలో సందేహం లేదు. స్టీవ్‌ స్మిత్‌ దూరమైనా... వార్న్‌ వంటి వారు మెంటార్‌గా ఉండటంతో జట్టు సమతూకంతో కనిపిస్తోంది. రహానే కెప్టెన్సీ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగలడు.

సిక్స్‌లు కొట్టలేకపోయినా బౌండరీలతో పరుగులు రాబట్టగలడు. వార్నర్‌ లేకపోవడం సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. బ్యాటింగ్‌లో అతడే జట్టు మూలస్తంభం. తన కెప్టెన్సీ కూడా అద్భుతం. అతడి స్థానంలో వస్తున్న విలియమ్సన్‌ ఈ సీజన్‌లో తమ దేశం తరఫున బాగా ఆడాడు. కెప్టెన్‌గా అతడు బాగా ఎదిగాడు. భావాలను బహిరంగంగా ప్రదర్శించే అతడు... పరిస్థితులను అంతే చక్కగా అర్థం చేసుకుంటాడు. గొప్ప బ్యాట్స్‌మన్, గొప్ప బౌలర్‌ మధ్య జరిగినట్లే కెప్టెన్ల మధ్య కూడా పోరాటం ఉంటుంది. ఏదేమైనా... ఈ ఏడాది ఏ కెప్టెనైతే మ్యాచ్‌ను మలుపుతిప్పగల వ్యూహాలు పన్నుతాడో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. 

మరిన్ని వార్తలు