తాము గెలవగలమని నమ్మాలి

17 Jan, 2018 01:53 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

మా జట్టుకు మ్యాచ్‌పై పట్టు చిక్కిందని అటు బ్యాట్స్‌మెన్, ఇటు బౌలర్లు ఎవరూ గట్టిగా చెప్పలేని విధంగా ఈ టెస్టు మ్యాచ్‌ సాగుతోంది. ఒక్కో సందర్భంలో అంటే కోహ్లి, డివిలియర్స్‌లు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు మాత్రం వారి జట్లకు అంతా బాగున్నట్లు అనిపించింది కానీ నిజానికి ఈ పిచ్‌ అందరి అంచనాలను తారుమారు చేసింది. దక్షిణాఫ్రికా స్కోరుకు చేరువగా వచ్చేందుకు కోహ్లి అద్భుత సెంచరీ ఉపకరించింది. సాంకేతికత, పట్టుదల, డిఫెన్స్, చక్కటి స్ట్రోక్‌లు కలగలిసిన నాణ్యమైన శతకంగా దీనిని అందరూ గుర్తుంచుకోవచ్చు. నిజానికి అప్పటి వరకు చాలా బాగా బ్యాటింగ్‌ చేసిన అశ్విన్‌ కొత్త బంతిని వెంటాడే ప్రయత్నం చేయకుండా ఉంటే భారత్‌కు కచ్చితంగా ఆధిక్యం లభించి ఉండేది.

 తన బౌలింగ్‌ ప్రతీ రోజూ ముందు రోజుకంటే మెరుగ్గా ఉండేందుకు అశ్విన్‌ ఎంతో మేధోమథనం చేస్తాడు. అందులో కొంత బ్యాటింగ్‌పై కూడా పెడితే చాలా ఎక్కువ పరుగులు సాధించగలడు. ఆఫ్‌స్టంప్‌పైకి ఎక్కువ ఎత్తులో దూసుకొచ్చిన బంతిని షాట్‌ ఆడబోయి అతను ఎన్ని సార్లు అవుటయ్యాడు? తన కెరీర్‌లో అతను వెస్టిండీస్‌పై నాలుగు సెంచరీలు చేసినా... వారిలో ఎవరూ ప్రమాదకర స్వింగ్‌ బౌలర్‌ లేడు. తాను అవుటైన సందర్భాలను అతను విశ్లేషించుకుంటే బౌలర్‌ ప్రతిభకంటే తన పొరపాట్లే ఎక్కువగా కనిపిస్తాయి.  

కోహ్లి, పాండ్యా చక్కటి ఆటతో మూడో రోజు ఆట ప్రారంభమైంది. కానీ పాండ్యా రనౌట్‌ దక్షిణాఫ్రికాకు బోనస్‌ వికెట్‌ అందించింది. పరుగు పూర్తి చేసే సమయంలో బ్యాట్‌ను క్రీజ్‌ వైపు తోయకపోవడం లేదా ఇద్దరు ఫీల్డర్లు ఒకే క్యాచ్‌ పట్టే ప్రయత్నం చేసినప్పుడు కనీసం అరవకపోవడంలాంటివి అంతర్జాతీయ క్రికెట్‌లో అసలు కనిపించరాదు. కానీ భారత జట్టు మాత్రం పదే పదే ఇలా చేస్తోంది. కుర్రాళ్లుగా ఉన్నప్పుడు వారిని తీర్చి దిద్దడంలో జరిగిన పొరపాటుగా నేను దీనిని భావిస్తాను. ముంబైలో స్కూల్‌ క్రికెట్‌ స్థాయిలోనే ఇలాంటివి నేర్పిస్తారు. అందువల్ల వారు సాధారణంగా ఇలాంటి తప్పులు చేయరు. 

తాము ఈ టెస్టు గెలవగలమని భారత్‌ నమ్మాలి. పిచ్‌పై బంతి ఒక్కోసారి పైకి లేస్తూ మరోసారి చాలా కిందకు వస్తోంది. ఆమ్లా, డివిలియర్స్‌ అవుటైన తీరు చూస్తే ఇది అర్థమవుతుంది. కాబట్టి లక్ష్య ఛేదన అంత సులువు కాదు. అయితే తమ కెప్టెన్‌లాగే ఇతర ఆటగాళ్లు కూడా విజయం సాధ్యమేనని భావిస్తే నిజంగా సాధించగలరు. ఇప్పటి వరకు ఈ టెస్టు అంచనాలకు అందకుండానే సాగుతోంది. అటు బ్యాట్, ఇటు బంతి ఆధిపత్యం ప్రదర్శించకుండా సిద్ధం చేసిన పిచ్‌ మాత్రమే దీనికి కారణమని చెప్పగలను.   
 

మరిన్ని వార్తలు