అతడు అర్ధరాత్రి కూడా పరుగులు చేయగలడు

4 Aug, 2018 00:39 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

భారత ఉత్తమ క్రికెటర్లయిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గతంలో ఇంగ్లండ్‌ గడ్డపై రాణించలేకపోయారు. 2014 పర్యటన వారు మర్చిపోదగిన వాటిలో ఒకటి. నాటి సంధి దశ తర్వాత ఇద్దరూ గొప్ప ఆటగాళ్లుగా ఎదిగారు. ఇక మిగిలిపోయిన ఈ సవాల్‌ వారికి చాలా క్లిష్టమైనది. మొదటి టెస్టు ద్వారా అందులో కొంత అధిగమించారు. దీంతోపాటు క్రికెట్‌ చరిత్రలో మేటి ఆటగాళ్లుగా నిలిచేందుకు మార్గం వేసుకున్నారు. వారి నైపుణ్యం, దృక్పథంపై ఎప్పుడూ సందేహాలు లేవు. తాజాగా వాటిని మిగతా ప్రపంచానికి చాటేందుకు ఓ అవకాశం దక్కింది. దానిని తమదైన శైలిలో నెరవేర్చారు.  టెస్టు తొలి రోజే అశ్విన్‌ బంతిని స్పిన్‌ తిప్పగలిగాడు. పిచ్‌ సహకారంతోనే అతనిలా చేయగలిగాడని ఎవరూ అనలేరు. అత్యుత్తమ నైపుణ్యంతోనే ఇది సాధ్యం. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ చుట్టూ ఉచ్చు పన్నిన అతడు వారిని కట్టిపడేశాడు. కుక్‌లాంటి విశేష అనుభవజ్ఞుడిని బౌల్డ్‌ చేయాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. కానీ అశ్విన్‌ దానిని సులువుగా చేసేశాడు. 

తర్వాత తానెందుకు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అయ్యాడో కోహ్లి చాటిచెప్పాడు. ఓవైపు వెంటవెంటనే మూడు వికెట్లు పడిపోవడం, మరోవైపు అండర్సన్‌ ఔట్‌ స్వింగ్‌తో తన ఆఫ్‌స్టంప్‌ బలహీనతను పరీక్షిస్తుండటంతో కోహ్లి ప్రారంభంలో చాలా శ్రమించాడు. ఇదే సమయంలో, ఇలాంటి పరిస్థితుల్లో ఓ బ్యాట్స్‌మన్‌కు అవసరమైన అదృష్టం కూడా తనకు దక్కింది. తర్వాత లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ను రక్షించుకుంటూ, స్ట్రయిక్‌ తీసుకుంటూ, జో రూట్‌ ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌ను అపహాస్యం చేస్తూ అద్భుతం సృష్టించాడు. తనను అన్నివిధాలా పరీక్షించడంతో పాటు, అనిశ్చిత స్థితి నుంచి జట్టును విజయం వైపు తీసుకెళ్లిన ఈ శతకాన్ని అతడు చాలాకాలం గుర్తు పెట్టుకుంటాడు. ఈ క్రమంలో తానిక్కడ రాణించాలంటే కౌంటీ క్రికెట్‌ ఆడాలనేమీ లేదని చూపాడు. అర్ధరాత్రి నిద్ర లేపినా పరుగులు చేయగల విశిష్ట నైపుణ్యం కోహ్లిది. ఒకవేళ భారత్‌ ఈ టెస్టుతో పాటు సిరీస్‌ గెలిచినా... అంతకుముందు ఆడిన సన్నాహక మ్యాచ్‌ ఇతర బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం ఉపయోగపడలేదనేది మాత్రం నిజం. దీనినిబట్టి కోహ్లి కంటే స్వింగ్‌ బంతిని ఆడలేకపోయిన వారికే కౌంటీల అవసరం ఎక్కువని తెలుస్తోంది. ఈ మ్యాచ్‌లోలాగా ప్రతిసారీ విరాట్‌ జట్టును కాపాడలేడు కదా?  

మరిన్ని వార్తలు