సన్‌రైజర్స్‌ ఆ ఇద్దరిపైనే ఆధారపడొద్దు 

17 May, 2018 01:37 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

పొట్టి ఫార్మాట్‌లో, మరీ ముఖ్యంగా ఐపీఎల్‌లో రెప్పపాటులో పరిస్థితులు తారుమారు అవుతాయి. లీగ్‌ ఆరంభంలో తడబడిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు చివరి దశకొచ్చేసరికి తమ జోరు పెంచి విజయాలను తమ ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇప్పటివరకు బ్యాట్స్‌మెన్‌పై ఎక్కువగా ఆధారపడిన బెంగళూరు జట్టుకు బౌలర్లు కూడా గాడిలో పడటంతో ప్లే ఆఫ్‌ అవకాశాలు సజీవంగా నిలిచాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్లు తేలిపోయారు. పిచ్‌ నుంచి మద్దతు లభించినా సరైన లైన్‌ అండ్‌ లెంగ్త్‌లో బౌలింగ్‌ చేయలేక ఇబ్బంది పడ్డారు. సన్‌రైజర్స్‌ విజయాల్లో ఇప్పటివరకు బౌలర్లే కీలకపాత్ర పోషించారు. ఆ జట్టు ఫీల్డింగ్‌ కూడా మెరుగవ్వాలి. దాంతోపాటు మిడిల్‌ ఆర్డర్‌ కాస్త బాధ్యతగా ఆడాలి.

ప్రతిసారీ విలియమ్సన్, శిఖర్‌ ధావన్‌లపై ఆధారపడాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు.  ఐపీఎల్‌లో పిచ్‌లు అద్భుతంగా ఉన్నాయి. ఈ విషయంలో బీసీసీఐని మెచ్చుకోవాలి. తొలి బంతి నుంచే టర్న్‌ కాకుండా మంచి ఎత్తులో బ్యాట్‌పై బంతులు వచ్చే విధంగా వీటిని రూపొందించారు. అయితే అదనపు బౌన్స్‌ కారణంగా రంజీ ట్రోఫీలో మెరిసిన కొందరు బ్యాట్స్‌మెన్‌ షార్ట్‌ పిచ్‌ బంతులను ఆడలేకపోతున్నారు. ఈ జాబితాలో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యే ఆటగాళ్లూ ఉన్నారు. భారత్‌తో పోలిస్తే ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌన్స్‌ ఇంకా ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. మరోవైపు ప్లే ఆఫ్‌కు ముందు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు మళ్లీ విజయాలబాట పట్టాలనే లక్ష్యంతో ఉంది. అయితే నెమ్మదిగా జోరు పెంచి ఫామ్‌లోకి వచ్చిన విరాట్‌ కోహ్లి సారథ్యంలోని బెంగళూరు జట్టు ఉందన్న సంగతి మర్చిపోవద్దు.   

మరిన్ని వార్తలు