చెన్నై ఎక్కడైనా సూపర్‌కింగే 

22 May, 2018 00:41 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లే ఆఫ్‌కు చేరడం కొత్తేమీ కాదు. ఒకవేళ ఆ జట్టు టాప్‌–4లో లేకపోతేనే ఆశ్చర్యపడాలి. ఆ జట్టు సత్తా ఏంటో గత సీజన్‌ల రికార్డులే చెబుతాయి. ఢిల్లీ చేతిలో ఎదురైన ఓటమి ఒక విధంగా చెన్నైని మేలుకొలిపింది. టాప్‌–2లో నిలవాల్సిందేనన్న పట్టుదలను సూపర్‌కింగ్స్‌ ఆటగాళ్లలో పెంచింది. అదే పంజాబ్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో కనబడింది. ఒక్క ఓటమితో వెంటనే కళ్లుతెరిచిన చెన్నై చివరి మ్యాచ్‌లో సత్తా చాటింది. అయితే 18 ఓవర్లలోపే పంజాబ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించి ఉంటే అగ్రస్థానంలో నిలిచేది. సూపర్‌కింగ్స్‌కు ఉన్న ప్రేక్షకాదరణ చూస్తుంటే ఆశ్యర్యం వేస్తుంది. ఇది కేవలం చెన్నై వేదికకే పరిమితం కాలేదు. సూపర్‌కింగ్స్‌ ఎక్కడ ఆడితే అక్కడ ఘనమైన మద్దతు లభిస్తోంది. దేశవ్యాప్తంగా ధోని సేనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరులో ఇలాంటి ఆదరణ కేవలం కెప్టెన్‌ కోహ్లి, డివిలియర్స్‌లకే ఉంది. బెంగళూరు వెలుపల కూడా వీరిద్దరి ఆటంటే ప్రేక్షకులు ఎగబడతారు. ఈ సీజన్‌లో వీరోచిత ప్రదర్శన కనబరిచిన రాయుడు చివరి మ్యాచ్‌లో విఫలమయ్యాడు. తొలి క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముఖ్యంగా తమ ప్రత్యర్థి ఓపెనర్లు రాయుడు, వాట్సన్‌లపైనే దృష్టి పెట్టొచ్చు. చెన్నైకి వీళ్లిద్దరు శుభారంభమిస్తే మిగతా కథ ఫామ్‌లో ఉన్న సురేశ్‌ రైనా, ధోని నడిపిస్తారు. హైదరాబాద్‌ బౌలర్లు భువనేశ్వర్, రషీద్‌ ఖాన్‌లు ఈ సీజన్‌లోనూ తమ నైపుణ్యాన్ని కనబర్చారు. వీరికి సిద్ధార్థ్‌ కౌల్‌ రూపంలో మరో బలం జతయ్యింది. చెన్నై బ్యాట్స్‌మెన్‌ ఈ త్రయంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైజర్స్‌ బ్యాటింగ్‌కు కెప్టెన్‌ విలియమ్సన్, ఓపెనర్‌ ధావన్‌లే బలం. మిడిలార్డర్‌లో షకీబ్, మనీశ్‌ పాండేలు రాణిస్తున్నారు. అయితే ఈ జట్టు గత మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్నే చవిచూసింది. వరుస ఓటములతో సన్నగిల్లిన ఆత్మవిశ్వాసం చెన్నైకి లాభించవచ్చు.   

మరిన్ని వార్తలు