ప్రేక్షకులకు కావాల్సింది అదే! 

15 Apr, 2018 01:09 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

ఈ ఏడాది ఐపీఎల్‌ అద్భుత రీతిలో ప్రారంభమైంది. తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సునాయాస గెలుపు మినహా... మిగతా జట్లన్నీ చివరి బంతికో, లేదా ఆఖరి ఓవర్లోనో విజయాన్ని అందుకున్నాయి. నాణ్యమైన పేస్‌ బౌలింగ్, అత్యుత్తమ స్థాయి స్పిన్, దూకుడైన, కళాత్మక షాట్లు స్టేడియంలో ఉన్నా, టీవీ ముందు ఉన్నా ప్రేక్షకుడిని ఆసాంతం కట్టిపడేస్తాయి. ఇలా ఆటలోని అన్ని కోణాలూ బయటకు రావడం, అందరినీ ఊపేసే ఉత్కంఠభరిత క్షణాలే ఈ ఫార్మాట్‌ను విజయవంతం చేశాయి. ఏబీ డివిలియర్స్‌ వంటి ఆటగాడి చక్కటి ఇన్నింగ్స్‌తో బెంగళూరు తొలి విజయం సాధించింది. అతడు ఇదే ఊపు కొనసాగిస్తే రాజస్తాన్‌ను ఓడించగలమని బెంగళూరు ఆశిస్తోంది. రెండింటిలోనూ అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ ఉన్నా... బౌలింగే కొంత ఆలోచించేలా చేస్తోంది.

అయితే, బౌలర్లు వేసే బంతిని బ్యాట్స్‌మెన్‌ మైదానం నలుమూలలకు, కొన్నిసార్లు బయటకు కొట్టడమే కదా అభిమానులకు కావాల్సింది. అద్భుత ఆటతో టోర్నీలో ఘన పునరాగమనం చేసిన చెన్నై సూపర్‌కింగ్స్‌ జోరుమీదుంది. ధోని ప్రశాంతత జట్టులోని మిగతా సభ్యులకూ అబ్బినట్లుంది. ఓటమి తప్పని క్లిష్ట పరిస్థితుల్లోనూ నిబ్బరం కోల్పోకుండా ఆడి చెన్నై విజయాలు సాధించింది. మ్యాచ్‌ను తమవైపు తిప్పే నిర్ణయాలు తీసుకోవడంలో కెప్టెన్లది కీలకపాత్ర. చివరి ఓవర్లకు వచ్చే సరికి వ్యూహాలకోసం చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఫలితం కోసం అర్థరాత్రి వరకు చూస్తున్న ప్రేక్షకులు ఇళ్లకు చేరేందుకు రవాణా సౌకర్యాలు ఉండటం లేదు. ఆట లయను దెబ్బతీసే ఇలాంటి ఎత్తుగడలు డబ్బు చెల్లించే ప్రేక్షకులకు ఎంతమాత్రం ఉపయోగపడవు. చివరి ఓవర్‌ ఎవరు వేస్తారు అనే దానికంటే కూడా వారెప్పుడూ ఉత్కంఠతనే కోరుకుంటారు. అందుకని కెప్టెన్లు వ్యూహ రచన కోసం ఎక్కువ సమయం తీసుకోకుండా అంపైర్లు జోక్యం చేసుకోవాలి. 

మరిన్ని వార్తలు