సారథి ప్రదర్శన కీలకం 

9 May, 2018 01:15 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

సరైన నాయకుడు ఉంటే జట్టు ప్రదర్శన కూడా బాగుంటుందని ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మళ్లీ నిరూపితమైంది. పాయింట్ల పట్టికలో అగ్రభాగంలో ఉన్న జట్ల కెప్టెన్‌లు స్వయంగా రాణిస్తుండటంతోపాటు సహచరులు మెరుగ్గా ఆడేలా స్ఫూర్తినిస్తున్నారు. ఇక పట్టికలో దిగువ ఉన్న జట్ల సారథులు తాము విఫలమవ్వడంతో పాటు సహచరుల్లోనూ ఆత్మవిశ్వాసం పెంచడంలో సఫలీకృతులు కాలేకపోతున్నారు. ప్రస్తుతం ‘టాప్‌’ పొజిషన్‌లో ఉన్న సన్‌రైజర్స్‌ జట్టు సారథి విలియమ్సన్‌ ఆటతీరును పరిశీలిస్తే ఓ కెప్టెన్‌ జట్టును ఎలా ముందుండి నడిపించాలో అవగతమవుతుంది. ఈ న్యూజిలాండ్‌ క్రికెటర్‌ తాను నిలకడగా పరుగులు సాధిస్తుండటమే కాకుండా ఏ దశలోనూ సంయమనం కోల్పోకుండా సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి ఇచ్చిన క్యాచ్‌ను విలియమ్సన్‌ వదిలేసినా పెద్దగా ఆలోచించకుండా వెంటనే తేరుకున్నాడు. మిగతా జట్లతో పోలిస్తే బెంగళూరుకు పటిష్టమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. కానీ ఛేజింగ్‌లో ఆ జట్టు తడబడుతోంది. ఇక  కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టు సారథి రవిచంద్రన్‌ అశ్విన్‌ నాయకత్వ పటిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. జట్టు ప్రదర్శన మెరుగయ్యేం దుకు అతను అనుక్షణం ఆలోచిస్తుంటాడు. మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పరుగులు సాధించినపుడల్లా ముంబై ఇండియన్స్‌ కూడా మంచి ఫలితాన్ని సాధిస్తోంది. దినేశ్‌ కార్తీక్‌లాంటి మంచి కెప్టెన్‌ ఉన్న కోల్‌కతాతో జరిగే మ్యాచ్‌లో ముంబై విజయం సాధిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌ దశకు అర్హత పొంది తమ టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తుంది.   

మరిన్ని వార్తలు