‘ధోని లాంటి కీపర్‌ ఉండటం కోహ్లికి కలిసొస్తుంది’

2 Mar, 2019 11:20 IST|Sakshi

భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌

న్యూఢిల్లీ : ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న వన్డే వరల్డ్‌కప్‌- 2019 ఫైనల్‌లో టీమిండియా- ఇంగ్లండ్‌ జట్లు తలపడే అవకాశం ఉందని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా సంచలన విజయాలు నమోదు చేస్తున్న విరాట్‌ సేనకు మూడోసారి ప్రపంచ కప్‌ అందించే సత్తా ఉందని పేర్కొన్నాడు. ‘ధోని లాంటి వికెట్‌ కీపర్‌ ఉండటం విరాట్‌ కోహ్లికి కలిసి వచ్చే అంశం. అంతేకాదు జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు కోహ్లి.. ధోని సలహాలు తప్పక తీసుకుంటాడు. వారిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్‌ ఉంది. డెత్‌ ఓవర్లలో ఫీల్డర్‌ను ఎక్కడ పెట్టాలి.. ఎవరు ఎలా బౌలింగ్‌ చేయాలనే వ్యూహాలు రచించడంలో ధోని దిట్ట. ఇవే కాదు చేజారుతున్న మ్యాచ్‌ను మన గుప్పిట్లోకి తీసుకురావడంలో ధోని చాలాసార్లు సఫలీకృతుడయ్యాడు. అందుకే అతడంటే కోహ్లికి చాలా గౌరవం. వారి కెమిస్ట్రీతో భారత్‌ మూడోసారి కప్పు గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి’ అని వ్యాఖ్యానించాడు.

బౌలింగ్ జట్టు పటిష్టంగా ఉంది...
ప్రస్తుతం టీమిండియా బౌలింగ్‌ జట్టు పటిష్టంగా ఉందని గవాస్కర్‌ పేర్కొన్నాడు. జస్ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చహల్‌ సొంత గడ్డపైనే కాకుండా విదేశాల్లో కూడా రాణిస్తున్నారని కొనియాడాడు. ఇంగ్లండ్‌ టూర్‌లో ఇవన్నీ టీమిండియాకు కలిసి వచ్చే అవకాశాలని పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియా గడ్డపై సంచలనాలు నమోదు చేసిన కోహ్లి సేన.. ప్రస్తుతం స్వదేశంలో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రపంచకప్‌నకు ముందు భారత్‌- ఆసీస్‌ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ జరగనుంది. ఇందులో భాగంగా శనివారం హైదరాబాద్‌లో తొలి వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. మెగా టోర్నీకి ముందు జరుగుతున్న ఆఖరి వన్డే సిరీస్‌ కావడంతో కోహ్లి సేన విజయంపై దృష్టిసారించింది.

మరిన్ని వార్తలు