రంజీ జరుగుతుంటే ‘ఎ’ మ్యాచ్‌లు ఎందుకు?

27 Jan, 2020 03:00 IST|Sakshi

ఐపీఎల్‌ సమయంలో ఎవరికీ అలసట ఉండదు

సునీల్‌ గావస్కర్‌ సూటి ప్రశ్న

ముంబై: భారత క్రికెట్‌లో ప్రతిష్టాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీ స్థాయిని బీసీసీఐ అధికారులే రాన్రానూ దిగజారుస్తున్నారని మాజీ కెప్టెన్ సునీల్‌ గావస్కర్‌ విమర్శించారు. రంజీ ట్రోఫీలో కొనసాగుతున్న సమయంలో ‘ఎ’ జట్టు పేరుతో అగ్రశ్రేణి ఆటగాళ్లను విదేశీ పర్యటనలకు పంపడంలో ఔచిత్యాన్ని ఆయన  ప్రశ్నించారు. ఇప్పటికే మరోవైపు అండర్‌–19 ప్రపంచకప్‌ కూడా జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఎక్కువ క్రికెట్‌ ఆడటం వల్ల మన ఆటగాళ్లు అలసిపోతున్నారనే మాట గత కొన్నేళ్లలో తరచుగా వినిపిస్తోంది. ఒక్కసారి ఐపీఎల్‌ వచి్చందంటే చాలు ఎవరికీ అలసట ఉండదు. ఇలా చేసే రంజీ ట్రోఫీ విలువను తగ్గిస్తున్నారు. సీనియర్‌ టీమ్‌ కివీస్‌ పర్యటనలో ఉందంటే అది ద్వైపాక్షిక ఒప్పందం కాబట్టి అర్థముంది.

అదే సమయంలో ‘ఎ’ జట్టును అక్కడకు పంపాల్సిన అవసరం ఏమిటి.  దీనివల్ల ప్రతీ రాష్ట్ర జట్టులో కీలక ఆటగాళ్లు రంజీ ట్రోఫీకు దూరమై టోర్నీ కళ తప్పుతోంది. పైగా నాకౌట్‌కు అర్హత సాధించాల్సిన సమయంలో కొన్ని టీమ్‌లు ఒక్కసారిగా బలహీనంగా మారిపోతున్నాయి. సీనియర్‌ జట్టులో ఎవరైనా గాయపడితే దగ్గరలో అందుబాటులో ఉంటారనే వాదన సరైంది కాదు. ప్రపంచంలో ఏ జట్టు కూడా ఇలా చేయడం లేదు. తమ దేశవాళీ సీజన్‌ సమయంలో ఏ టీమ్‌ కూడా విదేశీ పర్యటనలకు ఆటగాళ్లను పంపించదు.ఐపీఎల్‌ జరిగే సమయంలో ‘ఎ’ టూర్‌లు, అండర్‌–19 సిరీస్‌లు ఏర్పాటు చేస్తారా?’ అని ఆయన సూటిగా ప్రశి్నంచారు.  

మరిన్ని వార్తలు