కపిల్‌ అయితే 25 కోట్లు పలికేవాడు!

19 Dec, 2018 10:40 IST|Sakshi
సునీల్‌ గవాస్కర్‌

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు కపిల్‌ దేవ్‌ ప్రస్తుత ఐపీఎల్‌ వేలంలో ఉంటే రూ.25 కోట్లు తగ్గకుండా పలికేవాడని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఆజ్‌తక్‌ చానెల్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానిక హాజరైన ఈ దిగ్గజ క్రికెటర్లు సరదాగా నాటి రోజులను నెమరువేసుకున్నారు. ‍కపిల్‌దేవ్‌ గొప్ప ఆటగాడని ఈ సందర్భంగా సునీల్‌ గవాస్కర్‌ కొనియాడాడు. కపిల్‌ జింబాంబ్వేపై ఆడిన(175 పరుగులను) ఇన్నింగ్స్‌ను మళ్లీ తాను ఇంతవరకు చూడలేదని చెప్పుకొచ్చాడు. 

‘ఓ ఆటగాడిగా.. కామెంటేటర్‌గా వన్డే చరిత్రలోనే అదో గొప్ప ఇన్నింగ్స్‌. మళ్లీ ఇంతవరకు నేను అలాంటి గొప్ప ఇన్నింగ్స్‌ చూడలేదు. ఆ మ్యాచ్‌లో మేము 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయాం. అప్పుడు చాలా చలిగా ఉంది. అంతేకాకుండా బంతి కూడా బాగా తిరిగింది. ఈ పరిస్థితుల్లో 70 లేక 80 పరుగులు కూడా చేస్తామనుకోలేదు. కానీ కపిల్‌ అద్బుత ఇన్నింగ్స్‌తో  మ్యాచ్‌ను గెలిపించాడు. అతనేం నెమ్మదిగా ఆడలేదు. సిక్సర్లతో చెలరేగాడు. అతను కానీ తాజా ఐపీఎల్‌ వేలంలో ఉంటే కచ్చితంగా రూ.25 కోట్లు పలికేవాడు.’ అని ఈ మాజీ కెప్టెన్‌ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలపై కపిల్‌ నవ్వుతూ.. ఇంత వరకు అంత డబ్బును ఊహించలేదని చెప్పుకొచ్చాడు. కానీ గవాస్కర్‌ మాత్రం అది కవిల్‌ విలువ అని స్పష్టం చేశాడు. ఆల్‌రౌండర్‌ అయిన కపిల్‌.. 225 వన్డేల్లో 3783 పరుగులతో పాటు 253 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత్‌కు ప్రపంచకప్‌ అందించిన తొలి కెప్టెన్‌ కూడా కపిలేనన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌- 2019 సీజన్‌ కోసం మంగళవారం జరిగిన వేలంలో 351 ఆటగాళ్లలో 60 మందిని 8 ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. పేసర్‌ ఉనాద్కత్‌, యువ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిలు రూ.8.4 కోట్లు పలకగా..విహారి రూ.2 కోట్లు, ఇషాంత్‌ రూ.1.1 కోట్లు,  షమీ రూ.4.8 కోట్లు పలికారు. సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ను ముంబై ఇండియన్స్‌ కోటీ రూపాయలకు సొంతం చేసుకుంది.  

మరిన్ని వార్తలు