రహానే ఒక్కడే అందుకు మినహాయింపు : గావస్కర్‌

7 Aug, 2018 08:58 IST|Sakshi
టీమిండియా ఆటగాడు అజింక్య రహానే

ఇంగ్లండ్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు కోహ్లి సేన పూర్తి స్థాయిలో సన్నద్ధం అయినట్లు కనిపించడం లేదని భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గావస్కర్‌ విమర్శించాడు. ఆదివారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నవతరం టీమిండియా ఆటగాళ్లలో అజింక్యా రహానే తప్ప మిగతా ఆటగాళ్లెవరు బ్యాటింగ్‌ విషయంలో తన సలహాలు అడగడం లేదన్నాడు. ‘ఒకప్పుడు సచిన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ వంటి మేటి ఆటగాళ్లంతా నాతో కాంటాక్ట్‌లో ఉంటూ బ్యాటింగ్‌ మెళకువలు నేర్చుకునేవారు. కానీ ప్రస్తుత ఆటగాళ్ల తీరు ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎవరి సూచనలు, సలహాలు తీసుకునేందుకు వారు అంతగా ఆసక్తి చూపడం లేదని, రహానే మాత్రం ఇందుకు మినహాయింపు’  అని సన్నీ వ్యాఖ్యానించాడు.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో శిఖర్‌ ధావన్‌ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. టెస్టుల్లో తన ఆట తీరును మార్చుకునేందుకు అతడు ఏమాత్రం ప్రయత్నించడం లేదని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికీ వన్డేల తరహాలోనే షాట్లు ఆడితే స్లిప్‌లో క్యాచ్‌లు ఇవ్వడం తప్ప పరుగులు మాత్రం రావన్నాడు. ఫార్మాట్‌కు తగినట్లుగా ఆడేందుకు మానసికంగా సిద్ధపడినప్పుడే వైఫల్యాలను అధిగమించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.

మరిన్ని వార్తలు