ఇదేమి సెలక్షన్‌ కమిటీరా నాయనా!

29 Jul, 2019 16:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అసలు ఇది బీసీసీఐ సెలక్షన్‌ కమిటీనేనా అంటూ విమర్శించాడు. వెస్టిండీస్‌ పర్యటనకు భారత జట్టును ప్రకటించే క్రమంలో సెలక్షన్‌ కమిటీ వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నాడు. ‘ఇదొక కుంటి బాతు సెలక్షన్‌ కమిటీలా ఉంది. ముందుగా వెస్టిండీస్‌ పర్యటనకు కోహ్లి దూరం అవుతాడని సెలక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా విండీస్‌ పర్యటనకు కోహ్లినే కెప్టెన్‌ అంటూ ప్రకటించారు. మూడు ఫార్మాట్లకు అతనే కెప్టెన్‌ అంటూ వెల్లడించారు. దాంతో అనేక ప్రశ్నలకు తావిచ్చారు బీసీసీఐ సెలక్టర్లు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా అనే విమర్శలు వచ్చాయి.

ఈ తరహా సెలక్షన్‌ విధానం సరైనది కాదు. మాకు తెలిసిన నాలెడ్జ్‌ ప్రకారం కోహ్లి కెప్టెన్సీ అనేది వరల్డ్‌కప్‌ వరకే. ఆ తర్వాత కెప్టెన్‌ను ఎంపిక చేసే అధికారం సెలక్టర్లకు ఉంది. మరి అలా చేయకుండా కోహ్లినే కెప్టెన్‌గా తిరిగి కొనసాగిస్తూ ఆగమేఘాలపై ఎందుకు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ కోహ్లిని కెప్టెన్‌గా తిరిగి ఎంపిక చేయాలనుకుంటే దానికో సాదారణ సమావేశం నిర్వహించి అప్పుడు ప్రకటించాల్సింది ’ అని ఎంఎస్‌కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీపై గావస్కర్‌ ధ్వజమెత్తాడు. అదే సమయంలో వరల్డ్‌కప్‌లో ఆడిన ఆడిన కొంతమంది ఆటగాళ్లను ఏ రకంగా తప్పించారని గావస్కర్‌ నిలదీశాడు. ఒకవేళ ఆయా ఆటగాళ్ల ప్రదర్శన బాగాలేదో అనుకుంటే, మరి భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించకపోయినా కెప్టెన్‌గా కోహ్లినే కొనసాగించడం తప్పుడు సంకేతాలకు దారి తీయదా అని ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు