ఫ్రీగా మ్యాచ్‌ చూస్తున్నారా.. బాధ్యత ఎవరిది?

12 Oct, 2019 15:51 IST|Sakshi

భద్రతా సిబ్బందిపై సునీల్‌ గావస్కర్‌ ఆగ్రహం

పుణె : అపరిచిత వ్యక్తుల కారణంగా ఆటగాళ్లకు ఏదైనా హాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సునీల్‌ గావస్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భద్రతా సిబ్బందిపై ఉన్నది ఆటగాళ్లకు రక్షణ కల్పించేందుకు మాత్రమేనని.. ఉచితంగా మ్యాచ్‌ చూసేందుకు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకొచ్చిన విషయం తెలిసిందే. టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దగ్గరికి పరిగెత్తుకు వచ్చిన సదరు వ్యక్తి.. క్రికెటర్‌ పాదాలను ముద్దాడాలనే తొందరలో పట్టుకుని కిందకు లాగేశాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతడిని తీసుకువెళ్లారు.(చదవండి : రోహిత్‌ను ముద్దాడేందుకు... మైదానంలోకి..)

ఈ నేపథ్యంలో కామెంటరీ బాక్సులో ఉన్న సునీల్‌ గావస్కర్‌ భద్రతా సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. సెక్యూరిటీ వాళ్లు ప్రేక్షకులను చూడకుండా ఆటను చూస్తున్నారు. ఇదే భారత్‌లో ఉన్న అతిపెద్ద సమస్య. సెక్యూరిటీ ఉన్నది మ్యాచ్‌ను ఉచితంగా చూసేందుకు కాదు. ఆటగాళ్ల రక్షణే వారి ప్రథమ కర్తవ్యం. అయినా ఇలా అపరిచిత వ్యక్తులు మైదానంలోకి దూసుకువస్తూనే ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ల దగ్గర కూడా ఒక కెమెరా పెట్టాలి. వారు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. ఇలా జరగడం మనకు మామూలుగానే కనిపించినా... ఆటగాళ్ల ప్రాణాలకు ఎంతో ప్రమాదకరమైనది. గతంలో ఇలా జరిగినా భద్రతా సిబ్బంది తీరులో మార్పు రాలేదు. మైదానంలోకి రావాలంటే ఎన్నో బారికేడ్లు దాటాల్సి ఉంటుంది. అయినప్పటికీ సాధారణ వ్యక్తులు సులభంగా లోపలికి రావడం ఆందోళన కలిగించే అంశం. ఆటగాళ్లకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు’ అని విరుచుకుపడ్డాడు. కాగా గతంలో కూడా ఇలాంటి పలు ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా మాజీ సారథి ధోని, ప్రస్తుత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని చూసేందుకు అభిమానులు మైదానంలోకి దూసుకువచ్చారు.

మరిన్ని వార్తలు