పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకోవాలి

13 Feb, 2018 09:18 IST|Sakshi

భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : వర్షం అడ్డంకుల మధ్య అదృష్టం కూడా కలిసొచ్చి విజయం దక్కినందున దక్షిణాఫ్రికా ఇక ప్రతి వన్డేను గులాబీ దుస్తుల్లోనే ఆడాలని భావిస్తుండవచ్చు. ‘పింక్‌ డే’ మ్యాచ్‌లో వారెప్పుడూ ఓడిపోని రికార్డును కొంత వర్షంతో పాటు ఓ చేజారిన క్యాచ్, ఓ నోబాల్‌ పదిలంగా ఉంచాయి. మంచి షాట్లతో భారత్‌ను విజయానికి దూరం చేసిన డేవిడ్‌ మిల్లరే ఈ రెండుసార్లూ లబ్ధి పొందాడు. కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న హెన్రిక్‌ క్లాసెన్‌ అవకాశాన్ని అందిపుచ్చుకుని స్పిన్నర్ల బౌలింగ్‌లో హిట్టింగ్‌కు దిగి విజయవంతమయ్యాడు.

డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ఎక్కువగా లక్ష్యాన్ని ఛేదించే జట్టుకే ప్రయోజనకారి అని నిరూపితమైంది. అందుకని మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉన్నదని తెలిసీ టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేయాలన్న భారత్‌ నిర్ణయాన్ని ప్రశ్నించకుండా ఉండలేం. జట్టు స్కోరు 300 దాటకపోవడం, ఓటమి కారణంగా ధావన్, కోహ్లి అద్భుత భాగస్వామ్యం  మరుగున పడింది. ఏది సురక్షిత స్కోరు అనేది తెలియకపోవడమే కొన్నిసార్లు మొదట బ్యాటింగ్‌ చేయడంలో ఉన్న సమస్య. స్కోరింగ్‌ రేట్‌ పెంచే క్రమంలో అవుటై కోహ్లి మరో శతకం చేజార్చుకున్నాడు. ధావన్‌ ఈసారి సెంచరీ కొట్టినా... వర్షం అంతరాయం అతడి ఏకాగ్రతను దెబ్బ తీసింది.

మన బౌలింగ్‌ తీరు చూశాక మరో గెలుపు దారిలో ఉన్నట్లే అనిపించింది. కానీ డివిలియర్స్‌ తమ జట్టుకు ఊపు తెచ్చాడు. చహల్‌ నోబాల్‌ కూడా వారికి కలిసొచ్చింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఇలా లైఫ్‌ పొంది మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌ ఆడటం ఇది ఇటీవలి కాలంలో రెండోసారి. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నోబాల్‌ వేయడం అన్నది నేరంతో పాటు ప్రాథమిక అంశాలకు కట్టుబడకపోవడంలో నిర్లక్ష్యం, బద్ధకానికి నిదర్శనం. నోబాల్‌ అదనపు పరుగు మాత్రమే ఇవ్వదు.

తదుపరి బంతికి బ్యాట్స్‌మన్‌కు ఫ్రీ హిట్‌ లభించి అతడికి ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. వాతావరణం కారణంగా చేజారిన నాలుగో మ్యాచ్‌ గురించి టీమిండియా ఎక్కువగా ఆలోచించాల్సిన పనిలేదు. మంచి జట్లు తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాయి. పోర్ట్‌ ఎలిజబెత్‌లో మనం దానిని చూస్తామనే నమ్మకం ఉంది.

మరిన్ని వార్తలు