అది అతని శైలి కాదు: గావస్కర్‌

19 Aug, 2018 01:48 IST|Sakshi

ట్రెంట్‌బ్రిడ్జ్‌ టెస్టు కోసం ఎంపిక చేసిన పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం అంత సులభం కాదు. అలాంటిది టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రూట్‌ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. టర్న్‌ ఉన్న పిచ్‌పై టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు దాటగానే రూట్‌ తన నిర్ణయం సరైందా కాదా అనే ఆశ్చర్యానికి గురయ్యాడు. ఓపెనర్లు రాహుల్, ధావన్‌లిద్దరు సాధికారికంగా బ్యాటింగ్‌ చేశారు. ఆఫ్‌స్టంప్‌ ఆవల పడ్డ బంతుల జోలికి పోకుండా శరీరానికి దగ్గరగా ఆడుతూ చక్కటి ఆరంభం అందించారు. లార్డ్స్‌ టెస్టు హీరో వోక్స్‌ చెలరేగడంతో ఆ మరుసటి గంటలోనే ఇంగ్లండ్‌ పోటీలోకి వచ్చింది. అతను ధావన్‌తో పాటు, రాహుల్‌ను పెవిలియన్‌ పంపాడు. స్కోరింగ్‌ రేట్‌ గురించి గందరగోళానికి గురైన పుజారా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు.

హుక్‌ షాట్‌కు యత్నించి లంచ్‌కు ముందు డీప్‌ స్క్వేర్‌ లెగ్‌లో చిక్కాడు. ఇది అతని సహజసిద్ధ శైలి కాదు. తన షాట్ల ఎంపికను మార్చుకునే క్రమంలో పుజారా చేసిన తప్పిదం. టెస్టుల్లో 4 వేలకు పైగా పరుగులు సాధించిన ఓ బ్యాట్స్‌మన్‌ కొత్తగా తన శైలిని మార్చుకొని ఆడిన షాట్‌ అది. క్రీజులో గంటలకొద్ది పాతుకుపోవడం పుజారా గొప్పతనం. దాని వల్ల అవతలి ఎండ్‌లో ఉన్న ఆటగాడు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ఆడి వికెట్‌ సమర్పించుకున్నాడు. కోహ్లి, రహానే భాగస్వామ్యం మరోసారి భారత్‌ను మంచి స్థితిలోకి తెచ్చింది. వీరిద్దరు సాధికారికంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. 300లకు పైగా స్కోరు చేస్తే భారత్‌ ఈ మ్యాచ్‌పై పట్టు బిగించొచ్చు.   

మరిన్ని వార్తలు