ఎమ్మెస్కే వారసుడిగా సునీల్‌ జోషి

5 Mar, 2020 06:21 IST|Sakshi

సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్‌

ముంబై: ఓ తెలుగు జట్టు మాజీ క్రికెటర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ చీఫ్‌ సెలక్టర్‌ పదవీకాలం ముగియగా... ఇప్పుడు అతని స్థానంలో మరో తెలుగు జట్టుతో అనుబంధం ఉన్న ఆటగాడు సునీల్‌ జోషి సెలక్షన్‌ కమిటీకి కొత్త చైర్మన్‌గా వచ్చాడు. 49 ఏళ్ల సునీల్‌ జోషి గతంలో హైదరాబాద్‌ రంజీ జట్టు హెడ్‌ కోచ్‌గా పని చేశాడు.  మదన్‌లాల్, ఆర్పీ సింగ్, సులక్షణా నాయక్‌లతో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా భారత మాజీ స్పిన్నర్‌ సునీల్‌ జోషి (సౌత్‌జోన్‌)ని ఎంపిక చేయగా... ఈ ఎంపికకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీనియర్‌ పురుషుల సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా జోషి సిఫారసును బోర్డు ధ్రువీకరించిందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. సెంట్రల్‌ జోన్‌ నుంచి ఖాళీ అయిన స్థానంలో మాజీ భారత పేస్‌ బౌలర్, 42 ఏళ్ల హర్వీందర్‌ సింగ్‌కు అవకాశమిచ్చారు. ఎమ్మెస్కేతో పాటు గగన్‌ ఖోడా (సెంట్రల్‌ జోన్‌) పదవీ కాలం కూడా ముగిసింది.

ఐదుగురు సభ్యుల కమిటీలో ఇప్పటికే జతిన్‌ పరంజపే (వెస్ట్‌ జోన్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌ జోన్‌), శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌ జోన్‌)లు ఉండగా... కొత్తవారు త్వరలోనే బాధ్యతలు చేపడతారు. భారత మాజీ క్రికెటర్లు నయన్‌ మోంగియా, అజిత్‌ అగార్కర్‌ సహా మొత్తం 40 మంది సెలక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోగా... ఇందులో నుంచి సునీల్‌ జోషి, హర్వీందర్, వెంకటేశ్‌ ప్రసాద్, రాజేశ్‌ చౌహాన్, శివరామకృష్ణన్‌లను తుది జాబితాకు ఎంపిక చేశారు. వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించాక చైర్మన్, సెలక్టర్‌ను ఖరారు చేశారు. ‘సెలక్షన్‌ కమిటీ కోసం అత్యుత్తమ వ్యక్తుల్నే ఎంపిక చేశాం. జోషి, హర్వీందర్‌లు సరైన దృక్పథంతో ఉన్నారు. ఇంటర్వ్యూలో వాళ్లిద్దరు వెలిబుచ్చిన అభిప్రాయాలు కూడా సూటిగా స్పష్టంగా ఉన్నాయి’ అని సీఏసీ చైర్మన్‌ మదన్‌ లాల్‌ తెలిపారు. సీఏసీకి చాలా దరఖాస్తులే వచ్చాయని, అందరి పేర్లను పరిశీలించాకే తుది జాబితాను సిద్ధం చేశామన్నారు. ఈ ప్రక్రియలో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పారు. చైర్మన్‌ సునీల్‌ జోషి, సెలక్టర్‌ హర్వీందర్‌లు నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటారు.  

జోషి తెలుసుగా...
సునీల్‌ జోషి అంటే గొప్పగా గుర్తొచ్చే ప్రదర్శన సఫారీపైనే! నైరోబీలో 1999లో జరిగిన వన్డే టోర్నీలో జోషి 10–6–6–5 బౌలింగ్‌ ప్రదర్శనతో భారత్‌ 8 వికెట్లతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. 1996 నుంచి 2001 వరకు సాగిన స్వల్ప కెరీర్‌లో జోషి 15 టెస్టులాడి 41 వికెట్లు, 69 వన్డేలు ఆడి 69 వికెట్లను పడగొట్టాడు. హైదరాబాద్‌ రంజీ కోచ్‌గా వ్యవహరించిన జోషికి బంగ్లాదేశ్‌ జాతీయ జట్టు సహాయ సిబ్బందిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. మాజీ పేసర్‌ హర్వీందర్‌ది కూడా స్వల్ప కాలిక కెరీరే! 1998 నుంచి 2001 వరకు కేవలం నాలుగేళ్లే టీమిండియా సభ్యుడిగా ఉన్న ఈ మాజీ సీమర్‌ మూడే టెస్టులు, 16 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 4, వన్డేల్లో 24 వికెట్లు తీశాడు.  
 

మరిన్ని వార్తలు