మళ్లీ అదే జట్టుపై నరైన్‌ విశ్వరూపం

8 Apr, 2018 22:53 IST|Sakshi

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు సునీల్‌ నరైన మరోసారి చెలరేగిపోయాడు. గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 15 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన నరైన్‌.. ఈ ఏడాది కూడా అదే జట్టుపై విశ్వరూపం ప్రదర్శించాడు. 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, 5 సిక్సర్లతో  విరుచుకుపడి మరో వేగవంతమైన వ్యక్తిగత హాఫ్‌ సెంచరీని నరైన్‌ నమోదు చేశాడు. ఆర్సీబీ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్‌గా వచ్చిన నరైన్ దూకుడుగా ఆడి బౌండరీల మోత మోగించాడు. అయితే 50 పరుగుల వద్దే నరైన్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

కాగా, ఐపీఎల్‌లో 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల సరసన నరైన్‌ మరోసారి నిలిచాడు. ఐపీఎల్‌ చరిత్రలో 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన క్రికెటర్లలో గిల్‌క్రిస్ట్‌(2009;) క్రిస్‌ గేల్‌(2013), పొలార్డ్‌(2016), మోరిస్‌(2017)లు ఉన్నారు. గత ఐపీఎల్‌ సీజన్‌లో నరైన్‌.. బెంగళూరుపైనే ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ రికార్డును నమోదు చేశాడు. దాంతో ఐపీఎల్‌లో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించిన యూసఫ్‌ పఠాన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. అయితే ఆ రికార్డును కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ బద్దలు కొట్టాడు. తాజా సీజన్‌లో భాగంగా ఆదివారమే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ 14 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించి సరికొత్త రికార్డు నమోదు చేశాడు.దాంతో నరైన్‌-పఠాన్‌ల రికార్డు బ్రేక్‌ అయ్యింది.

మరిన్ని వార్తలు