భారత్... మళ్లీ సంచలనం

9 Nov, 2014 00:08 IST|Sakshi
భారత్... మళ్లీ సంచలనం

ప్రపంచ హాకీ చాంపియన్ ఆస్ట్రేలియాపై రెండో విజయం
 
 పెర్త్: రెగ్యులర్ కెప్టెన్ సర్దార్ సింగ్ గాయంతో ఆడకపోయినా... భారత హాకీ జట్టు మళ్లీ అద్భుతం చేసింది. నమ్మశక్యం కానీరీతిలో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను వారి గడ్డపైనే వరుసగా రెండోసారి ఓడించి సంచలనం సృష్టించింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 1-0తో ఆస్ట్రేలియాను బోల్తా కొట్టించింది. ఆట 34వ నిమిషంలో ఆకాశ్‌దీప్ సింగ్ అందించిన పాస్‌ను ఎస్‌వీ సునీల్ గోల్‌గా మలచడంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.

చివరి నిమిషం వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని టీమిండియా విజయాన్ని ఖాయం చేసుకుంది. కెరీర్‌లో 100వ మ్యాచ్ ఆడిన ‘డ్రాగ్ ఫ్లికర్’ రూపిందర్ పాల్ సింగ్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4-0తో నెగ్గగా... రెండో మ్యాచ్‌లో భారత్ 2-1తో గెలిచింది. సిరీస్‌లో చివరిదైన నాలుగో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది. ఆ మ్యాచ్‌లో ఓడినా భారత్ సిరీస్‌ను కోల్పోదు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం... ఓవరాల్‌గా భారత్, ఆస్ట్రేలియాల మధ్య 105 మ్యాచ్‌లు జరగ్గా... భారత్ 18 మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా 71 మ్యాచ్‌ల్లో గెలిచాయి. మిగతా 16 మ్యాచ్‌లు ‘డ్రా’ అయ్యాయి.

 జూనియర్ మహిళల జట్టుకు ఓటమి
 మరోవైపు న్యూజిలాండ్ జూనియర్ మహిళల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 0-5 గోల్స్ తేడాతో ఓడింది. ఆరు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఆదివారం జరుగుతుంది.

మరిన్ని వార్తలు