ఆడుతూ పాడుతూ... 

10 Apr, 2018 00:45 IST|Sakshi

తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ సునాయాస విజయం

9 వికెట్లతో రాజస్తాన్‌ చిత్తు

ధావన్‌ అర్ధసెంచరీ 

సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తాము కోరుకున్న రీతిలో ఐపీఎల్‌ను ప్రారంభించింది. ఎక్కడా ఎలాంటి తడబాటు లేకుండా అతి సునాయాసంగా తొలి విజయాన్ని అందుకుంది. పొదుపుగా బౌలింగ్‌ చేయడంలో తమ బౌలర్లు ఒకరితో మరొకరు పోటీ పడిన వేళ రైజర్స్‌ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 

సాక్షి, హైదరాబాద్‌: ఐపీఎల్‌–11లో మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శుభారంభం చేసింది. ఉప్పల్‌ స్టేడియంలో సోమవారం  జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. సంజు శామ్సన్‌ (42 బంతుల్లో 49; 5 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. కౌల్, షకీబ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం సన్‌రైజర్స్‌ 15.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 127  పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది.

శిఖర్‌ ధావన్‌ (57 బంతుల్లో 77 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌ ) కీలక అర్ధ సెంచరీ చేయగా కెప్టెన్‌ విలియమ్సన్‌ (35 బంతుల్లో 36 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. గురువారం ఇక్కడే జరిగే తమ తర్వాతి మ్యాచ్‌లో రైజర్స్, ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది.   ధావన్‌తో పాటు ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం దక్కించుకున్న సాహా (5) విఫలమయ్యాడు. అంతకుముందు వ్యక్తిగత స్కోరు సున్నా వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను రహానే వదిలేయడంతో బతికిపోయిన ధావన్‌ ఆ తర్వాత బ్యాట్‌ ఝళిపించాడు.   

 

>
మరిన్ని వార్తలు