ముంబైపై ‘విన్‌’ రైజర్స్‌

12 Apr, 2018 23:51 IST|Sakshi

హైదరాబాద్‌: సొంతగడ్డపై అంచనాలను నిలబెట్టుకుంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో కడవరకూ ఆసక్తికరంగా సాగిన పోరులో హైదరాబాద్‌ వికెట్‌ తేడాతో గెలుపును అందుకుంది. బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌(45; 28 బంతుల్లో 8 ఫోర్లు) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడగా, దీపక్‌ హుడా(32 నాటౌట్‌; 25 బంతుల్లో 1 ఫోర్‌ 1 సిక్స్‌) సమయోచిత ఇన‍్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

తొలుత బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు.. ముంబైను 147 పరుగులకే పరిమితం చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క‍్రమంలో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ను శిఖర్‌ ధావన్‌, వృద్ధిమాన​ సాహాలు ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 6.5 ఓవర్లలో 62 పరుగులు జోడించిన తర్వాత సాహా(22) ఔటయ్యాడు. ఆపై కొద్దిపాటి వ్యవధిలోనే కేన్‌ విలియమ్సన్‌(6) నిరాశపరచగా,  ధాటిగా ఆడుతున్న శిఖర్‌ ధావన్‌ కూడా పెవిలియన్‌ చేరాడు.

దాంతో హైదరాబాద్‌ 77 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు తర్వాత మనీష్‌ పాండే(11), షకిబుల్‌ హసన్‌(12)లు ఔట్‌ కావడంతో హైదరాబాద్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆ తరుణంలో దీపక్‌ హుడా, యూసఫ్‌ పఠాన్‌లు ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టారు.  అయితే పఠాన్‌(14) కీలక సమయంలో అవుట్‌ కావడంతో పాటు ఆపై మరుసటి బంతికే రషీద్‌ ఖాన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరాడు. 19 ఓవర్‌లో సిద్ధార్ధ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలు సైతం పరుగులేమీ చేయకుండా పెవిలియన్‌ చేరడంతో హైదరాబాద్‌ 137 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇక చివర్‌ ఓవర్‌లో విజయానికి 11 పరుగులు కావాల్సిన తరుణంలో హుడా తొలి బంతిని సిక్స్‌ కొట్టగా, రెండో బంతి వైడ్‌ అయ్యింది. ఆ తర్వాత రెండో బంతికి పరుగు రాకపోగా, మూడో బంతికి పరుగు వచ్చింది. నాల్గో బంతిని స్టాన్‌లేక్‌ సింగిల్‌ తీసి హుడాకు స్టైకింగ్‌ ఇచ్చాడు. ఇక ఐదో బంతికి మరో సింగిల్‌ రాగా, చివరి బంతిని స్టాన్‌ లేక్‌ ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

అంతకుముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సన్‌రైజర్స్‌ బౌలర్లు ధాటిగా బౌలింగ్‌ చేయడంతో ముంబై ఇండియన్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. ముంబై ఆటగాళ్లలో ఎవిన్‌ లూయిస్‌(29), కీరోన్‌ పొలార్డ్‌(28), సూర్యకుమార్‌ యాదవ్‌(28)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, రోహిత్‌ శర్మ(11), కృనాల్‌ పాండ్యా(15)లు నిరాశపరిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో స్టాన్‌లేక్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మ తలో రెండు వికెట్లు సాధించగా, రషీద్‌ ఖాన్‌, షకిబ్‌ వుల్‌ హసన్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

టాస్‌ గెలిచిన హైదరాబాద్‌.. ముంబైను ముందుగా బ్యాటింగ్‌ ఆహ్వానించింది. దాంతో ముంబై ఇన్నింగ్స్‌ను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఎవిన్‌ లూయిస్‌లు ఆరంభించారు. అయితే మ్యాచ్‌ రెండో ఓవర్‌లోనే స్టాన్‌లేక్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ పెవిలియన్‌కు చేరాడు. ఫస్ట్‌ డౌన్‌ వచ్చిన ఆటగాడు ఇషాన్‌ కిషాన్‌(9) కూడా విఫలమయ్యాడు. అయితే కాసేపు లూయిస్‌ మెరుపులు మెరిపించాడు. మూడు ఫోర్లు, రెండు సిక‍్సర్లతో ముంబై అభిమానుల్ని అలరించాడు. కాగా, జట్టు స్కోరు 54 పరుగుల వద్ద లూయిస్‌ అవుట్‌ కావడంతో ముంబై స్కోరులో వేగం తగ్గింది. ఆపై కీరోన్‌ పొలార్డ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు బ్యాట్‌ ఝుళిపించే యత్నం చేసినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. దాంతో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేయలేకపోయింది.

మరిన్ని వార్తలు