వార్నర్, ధావన్ ల బాదుడు:సన్ రైజర్స్ విజయం

22 May, 2014 23:31 IST|Sakshi

రాంచీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆది నుంచి విరుచుకుపడింది. ఓపెనర్లు శిఖర్ థావన్, డేవిడ్ వార్నర్ లు మంచి ఆరంభాన్నివ్వడంతో హైదరాబాద్ గెలుపు సునాయాసమైంది. డేవిడ్ వార్నర్(90) పరుగులతో చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేయగా, థావన్ (64) పరుగులతో నాటౌట్ మిగిలి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.హైదరాబాద్ ఆటగాళ్లలో ఫించ్ (7), ఓజా(19) పరుగులు చేశారు. దీంతో సన్ రైజర్స్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని ఖాతాలో మరోగెలుపును నమోదు చేసుకుంది.


అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా చెన్నై ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన చైన్నైకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. డుప్లెసిస్ (19) పరుగులతో ఫర్వాలేదనిపించినా, స్మిత్ (48; 28 బంతుల్లో 4సిక్స్ లు, 4 ఫోర్లు)తో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం సురేష్ రైనా (4) పరుగులకే పెవిలియన్ చేరాడు. వరుస వికెట్లు కోల్పోయి రన్ రేట్ మందగించిన తరుణంలో డేవిడ్ హస్సీ(50), ధోని (57) పరుగులతో ఆదుకున్నారు. వీరివురు నాటౌట్ గా చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో చెన్నై నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 185 పరుగులు చేసింది.

 

సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన ఒక లీగ్ మ్యాచ్‌ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్ తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో ముంబై జట్టు కచ్చితంగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. దీంతో పాటుగా హైదరాబాద్ రన్‌రేట్ కూడా మెరుగుపడాలి.
 

మరిన్ని వార్తలు