‘సన్‌’ బెర్త్‌ వారి చేతుల్లోనే...

4 May, 2019 01:00 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌ 

ఐపీఎల్‌ లీగ్‌ దశ ముగియడానికి మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్‌ జట్లు ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించాయి. చివరిదైన నాలుగో బెర్త్‌ కోసం రసవత్తర పోరు జరగనుంది. అయితే మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకే ప్లే ఆఫ్‌ బెర్త్‌ పొందే అవకాశాలు ఎక్కు వగా ఉన్నాయి. ఒకవేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ప్లే ఆఫ్‌నకు అర్హత సాధించకపోతే మాత్రం అది స్వీయ తప్పిదమే అవుతుంది. ఈ సీజన్‌లో పలుమార్లు గెలిచే దశ నుంచి ఓటమి వైపునకు వెళ్లిన హైదరాబాద్‌ సరైన కూర్పును ఎంచుకోవడం లేదు. బెయిర్‌స్టో, డేవిడ్‌ వార్నర్‌లాంటి స్టార్‌ ఆటగాళ్ల సేవలు కీలకదశలో ఆ జట్టుకు అందుబాటులో లేకపోయినా... వారిద్దరు ఎప్పుడు వెళ్లిపోతున్నారనే విషయం జట్టు యాజమాన్యానికి ముందే తెలిసిన నేపథ్యంలో సరైన ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసుకోవాల్సింది.

వార్నర్‌ లేని లోటు భర్తీ చేయలేకపోయినా దేశీయ ఆటగాళ్ల ఎంపిక కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. కొందరైతే ఫామ్‌లో ఉన్నట్లు కనిపించడంలేదు. మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టు వరుసగా ఆరు పరాజయాల తర్వాత మళ్లీ విజయాలబాట పట్టింది. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ రసెల్‌ను బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపించి తెలివైన నిర్ణయం తీసుకుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రసెల్‌ వీరవిహారం చేసి కోల్‌కతా పరువు కాపాడాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తూ 2012 తర్వాత ప్లే ఆఫ్‌ దశకు అర్హత సాధించింది. ప్రస్తుతం తమ అద్వితీయ ప్రదర్శనతో ఆ జట్టు  టైటిల్‌ ఫేవరెట్స్‌లో ఒకటిగా కనిపిస్తోంది. తర్వాతి మ్యాచ్‌ల్లోనూ శిఖర్‌ ధావన్, ఇషాంత్‌ శర్మలాంటి అనుభవజ్ఞులతోపాటు యువ ఆటగాళ్లు కూడా తమవంతు పాత్రను పోషించాలి. మొత్తానికి ఈ వారాంతం క్రికెట్‌ అభిమానులకు పసందుగా గడవనుంది.    
 

మరిన్ని వార్తలు