సన్‌రైజర్స్‌ చెంతకు మరో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌

19 Aug, 2019 20:29 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-13 కోసం ఫ్రాంచైజీలు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. తమ బలాబలాలను పరీక్షించుకుంటూనే, గత సీజన్‌లో జరిగిన పొరపాట్లపై దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు ఆటగాళ్లు, కోచింగ్‌ బృందంలో మార్పులు చేపట్టాయి. ఈ జాబితాలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ముందంజలో ఉంది. గత కొన్నేళ్లుగా సన్‌రైజర్స్‌కు సేవలందిస్తున్న టామ్‌ మూడీపై వేటు వేసి ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ చిరకాల కోరికను అందించిన ట్రేవర్‌ బేలిస్‌ను ప్రధాన కోచ్‌గా నియమించించిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాడిన్‌ను సన్‌రైజర్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా నియమించింది.

ఈ మేరకు సన్‌రైజర్స్‌ యాజమాన్యం ‘సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అసిస్టెంట్‌ కోచ్‌ బ్రాడ్‌ హాడిన్‌కు స్వాగతం’అంటూ తన అధికారిక ట్విటర్‌లో పేర్కొంది. ఇక ప్రధాన కోచ్‌ ట్రేవర్‌ బేలిస్‌ కూడా ఆసీస్‌కు చెందిన వాడే కావడం విశేషం. ఇక వచ్చే సీజన్‌కు సన్‌రైజర్స్‌కు సంబంధించిన పూర్తి సహాయక సిబ్బంది వివరాలను కూడా తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, మురళీథరన్‌లు మెంటార్లుగా వ్యవహరిస్తారని తెలిపింది. ఇక 2015 ప్రపంచకప్‌ గెలిచిన ఆసీస్‌ జట్టులో హాడిన్‌ సభ్యుడు. యాషెస్‌- 2015 అనంతరం క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన హాడిన్‌ 2016లో పలు సిరీస్‌లకు ఆసీస్‌-ఏ జట్టుకు సహాయక కోచ్‌గా పనిచేశాడు. ఇక ఆసీస్‌ తరుపున 66 టెస్టులు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ 3,266 పరుగులు చేయగా.. 126 వన్డేల్లో 3,122 పరుగులు సాధించాడు.  

మరిన్ని వార్తలు