సన్‌రైజర్స్‌ గెలుపు బాట పట్టేనా!

14 Apr, 2019 16:35 IST|Sakshi

రెండు వరుస ఓటములతో సన్‌రైజర్స్‌ డీలా

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న హైదరాబాద్‌

జోరు మీదున్న శ్రేయస్‌ అయ్యర్‌ బృందం

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా రెండు ఓటములతో గెలవాలనే కసి మీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఓ వైపు.... రెండు వరుస విజయాలతో ఊపు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు మరో వైపు.  ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు ఈ రెండు జట్లు తలపడనున్నాయి. గెలుపే లక్ష్యంగా పోరాడనున్నాయి. సొంతగడ్డపై హైదరాబాద్‌ను ఓడించి ఫిరోజ్‌షా కోట్లాలో తమకు ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ఢిల్లీ భావిస్తుండగా... మరోసారి ఢిల్లీపైనే గెలిచి విజయాల బాట పట్టాలని హైదరాబాద్‌ పట్టుదలగా ఉంది.  

వార్నర్, బెయిర్‌ స్టో పైనే ఆశలు...

మాజీ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ గత రెండు మ్యాచ్‌ల్లో లయ తప్పింది. సొంతగడ్డపై ముంబై చేతిలో, మొహాలిలో పంజాబ్‌ చేతిలో ఓటమి పాలైంది. లీగ్‌లో రైజర్స్‌కు చివరి విజయం ఢిల్లీ క్యాపిటల్స్‌పైనే. ఇదే ఆత్మవిశ్వాసంతో సన్‌ నేడు మ్యాచ్‌కు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో బౌలర్లు రాణించడంతో 129 పరుగులకే ఢిల్లీని కట్టడి చేసిన సన్‌ బృందం బ్యాటింగ్‌లోనూ రాణించి 5 వికెట్లతో గెలుపొందింది. తిరిగి అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని హైదరాబాద్‌ యోచిస్తోంది. కానీ మిడిలార్డర్‌ వైఫల్యంతో జట్టు కుదేలవుతోంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన వార్నర్‌–బెయిర్‌స్టో జంటపైనే హైదరాబాద్‌ బ్యాటింగ్‌ అతిగా ఆధారపడుతోంది. వీరిద్దరూ పెవిలియన్‌ చేరగానే ఇన్నింగ్స్‌ పేకమేడలా కుప్పకూలుతోంది. విజయ్‌ శంకర్‌ ఆరంభంలో టచ్‌లో ఉన్నట్లు కనిపించినా తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్‌ క్రీజులో నిలవలేకపోతున్నారు. భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మలతో కూడిన పేస్‌ విభాగం... అఫ్గాన్‌ స్పిన్‌ ద్వయం రషీద్‌ ఖాన్, నబీలతో బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తోంది. కానీ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా గాడిలో పడితే జట్టు ఖాతాలో మరో విజయం తప్పక చేరుతుంది.  

జోరు మీదున్న ఢిల్లీ...

లీగ్‌ ఆరంభంలో ఒకటి గెలిస్తే మరోటి ఓటమి అన్నట్లుగా సాగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పుడు అన్ని విభాగాల్లో కుదురుకుంది. బెంగళూరు, పటిష్ట కోల్‌కతా నైట్‌రైడర్స్‌లను వారి సొంతగడ్డలపై ఓడించి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. శిఖర్‌ ధావన్‌ కొత్త ఫామ్‌ను అందిపుచ్చుకున్నాడు. కోల్‌కతాపై సెంచరీ (63 బంతుల్లో 97 నాటౌట్‌)కి చేరువగా వచ్చి 7 వికెట్లతో తమ జట్టు గెలుపొందడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ నాలుగో స్థానానికి ఎగబాకింది. రిషబ్‌ పంత్‌ కూడా తనదైన శైలిలో ఆడుతూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్, పృథ్వీ షా కీలక ఇన్నింగ్స్‌తో త మ విలువను చాటుతున్నారు. కగిసో రబడ, క్రిస్‌ మోరిస్, ఇషాంత్‌ శర్మలతో బౌలింగ్‌ విభాగం కూ డా ప్రభావవంతంగా కనబడుతోంది. మరోసారి వీరంతా ఉమ్మడిగా రాణించి హైదరాబాద్‌పై పైచేయి సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.  

జట్లు (అంచనా)

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: వార్నర్, బెయిర్‌స్టో, విజయ్‌ శంకర్, మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా, యూసుఫ్‌ పఠాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్‌ కౌల్, సందీప్‌ శర్మ, రషీద్‌ ఖాన్, మొహమ్మద్‌ నబీ.


ఢిల్లీ క్యాపిటల్స్‌: శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్, రిషబ్‌ పంత్, కొలిన్‌ ఇంగ్రామ్, రాహుల్‌ తేవటియా, రబడ, మోరిస్, ఇషాంత్‌ శర్మ, కీమో పాల్, అక్షర్‌ పటేల్‌.  

మరిన్ని వార్తలు