మరో విజయం కోసం

21 Apr, 2017 22:31 IST|Sakshi
మరో విజయం కోసం

నేడు పుణేతో తలపడనున్నసన్‌రైజర్స్‌
ఉత్సాహంలో హైదరాబాద్‌
ఒత్తిడిలో సూపర్‌జెయింట్‌


పుణే : రెండు వరుస విజయాలతో గెలుపు బాట పట్టిన డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శనివారం రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌తో తలపడనుంది. రెండు ఓట ముల తర్వాత గాడిన పడిన సన్‌రైజర్స్‌.. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు పరాజయాల హ్యాట్రిక్‌ తర్వాత  ఎట్టకేలకు విజయం సాధించిన పుణే తన విజయమంత్రాన్ని కొనసాగించాలని కృత నిశ్చయంతో ఉంది.

సన్‌రైజర్స్‌ దూకుడు..
డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈ సీజన్‌లో ఆకట్టుకుంటోంది. తొలుత బెంగళూరు, గుజరాత్‌లపై విజయాలను నమోదు చేసిన హైదరాబాద్‌ అనంతరం ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో పరాజయం పాలైంది. అయితే తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకున్న సన్‌రైజర్స్‌.. ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌పై విజయాలు సాధించి జోరు కనబరుస్తోంది. అయితే హైదరాబాద్‌ సాధించిన విజయాలన్నీ సొంతగడ్డపైనే సాధించడం విశేషం. మరోవైపు పరాయి గడ్డపై ఆడిన రెండుమ్యాచ్‌ల్లోనూ పరాజయం పాలైంది. దీంతో పుణేలో జరిగే ఈ మ్యాచ్‌పై జట్టు కొంచెం ఆందోళన చెందుతున్న మాట వాస్తవమే. అయితే ప్రస్తుత సన్‌రైజర్స్‌ ఫామ్‌ను చూసినా.. పుణే ఆటతీరు పరిశీలించినా ఈ మ్యాచ్‌లో వార్నర్‌సేన ఫేవరేట్‌ అని చెప్పడంలో సందేహంలేదు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన వార్నర్‌సేన ఎనిమిది పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.

అయితే హైదరాబాద్‌పై పుణేకు మంచి రికార్డు ఉంది. గతేడాది పుణే సాధించిన నాలుగు విజయాల్లో రెండు సన్‌రైజర్స్‌పై వచ్చినవి కావడం విశేషం. ఈక్రమంలో గతేడాది ఎదురైన రెండు పరాజయాలకు వార్నర్‌సేన బదులు తీర్చుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆట గాళ్లలో 239 పరుగులతో వార్నర్‌ రెండోస్థానంలో ఉన్నాడు. ఢిల్లీతో మ్యాచ్‌లో తను విఫలమైనా జట్టు ఆందోళన పడడం లేదు. శిఖర్‌ శిఖర్‌ ధావన్, మోజెస్‌ హెన్రిక్స్‌ సత్తాచాటుతున్నారు. అయితే డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ విఫలమవడం జట్టును కలవరపరుస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లతో ఆడిన చివరిమ్యాచ్‌ల్లో యువీ విఫలమయ్యాడు. అయితే బంతితో ఫర్వాలేదనిపంచడం కొంచెం ఊరటనిచ్చే అంశం. సాధ్యమైనంత త్వరగా యువీ ఫామ్‌లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. మరోవైపు ఢిల్లీతో మ్యాచ్‌లో మెరుపువేగంతో బ్యాటింగ్‌ చేసిన కేన్‌ విలియమ్సన్‌ తుది జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. అతణ్నుంచి మరిన్ని మెరుపు ఇన్నింగ్స్‌లను జట్టు ఆశిస్తోంది. దీపక్‌ హూడా, నమన్‌ ఓజా రాణించాల్సిన అవసరముంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే సన్‌రైజర్స్‌కు టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్‌ విభాగం ఉంది.

జట్టు పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ 15 వికెట్లతో టోర్నీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. దీంతో పర్పుల్‌ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు. మరోవైపు అఫ్గాన్‌ సంచలన స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ తొమ్మిది వికెట్లతో సత్తా చాటుతున్నాడు. సిద్దార్థ్‌ కౌల్, దీపక్‌ హూడా రాణించాల్సిన అవసరముంది. మరోవైపు డిల్లీతో సీజన్‌లో తొలిమ్యాచ్‌ ఆడిన మహ్మద్‌ సిరాజ్‌ ఆకట్టుకున్నాడు. అతనికి మరిన్ని అవకాశాలు రావచ్చు. ఏదేమైనా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో సన్‌రైజర్స్‌ రానున్న మ్యాచ్‌ల్లో స్థాయికి తగ్గ ఆటతీరు ప్రదర్శించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

ధోని ఫామే కీలకం..
మరోవైపు గతేడాది ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ వరుస ఓటములతో డీలా పడింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన చివరిమ్యాచ్‌లో నెగ్గడం ద్వారా వరుసగా ఎదురైన మూడు పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. అయితే జట్టులో చాలా సమస్యలు ఉన్నాయి. కష్టకాలంలో ఉన్న భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఈ సీజన్‌లో వరుసగా విఫలమవుతున్నాడు. బెంగళూరుతో గత మ్యాచ్‌లో 28 పరుగులు చేసి ఫర్వాలేదపించాడు. అయితే అందులో మునుపటి మెరుపులు లేవు. ఐదు మ్యాచ్‌లాడిన ధోని 15 సగటుతో కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. మరోవైపు స్ట్రయిక్‌ రేట్‌ కూడా అంతంతమాత్రంగా (87 శాతం) ఉంది.  మరోవైపు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ విశ్రాంతి కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరం కావడంతో పుణే బ్యాటింగ్‌ మరింత బలహీన పడింది.

ఈ సీజన్‌లో 180 పరుగులు చేసిన స్మిత్‌ జట్టు తరఫున అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఈస్థితిలో స్మిత్‌ జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బే. జట్టు సారథ్య బాధ్యతలు అజింక్య రహానే చేపట్టే అవకాశముంది. టోర్నీలో అతను ఓ మాదిరిగా రాణించాడు. మనోజ్‌ తివారీ, రాహుల్‌ త్రిపాఠీ గాడిలో పడాల్సిన అవసరముంది. ఇక ఈ ఐపీఎల్‌లోనే ఖరీదైన ప్లేయర్‌గా నిలిచిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో రాణిస్తున్నాడు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఎనిమిది వికెట్లతో జట్టు తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

శార్దుల్‌ ఠాకూర్‌ ఆకట్టుకుంటున్నాడు. జైదేవ్‌ ఉనాద్కట్, డాన్‌ క్రిస్టియన్‌ సత్తాచాటాల్సిన అవసరముంది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లాడిన పుణే రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి.. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. దీంతో సాధ్యమైనంత త్వరగా జట్టు గాడిలోపడి వరుస విజయాలు సాధించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌పై మెరుగైన రికార్డున్న పుణే ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.

మరిన్ని వార్తలు