హ్యాట్రిక్‌పైనే సన్‌రైజర్స్‌ గురి

4 Apr, 2019 19:48 IST|Sakshi

ఢిల్లీ: ఐపీఎల్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌కు సైతం సన్‌రైజర్స్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్స్‌ దూరం కావడంతో మరొకసారి కెప్టెన్సీ బాధ్యతల్ని కెప్టెన్‌ భువనేశ్వర్‌ కుమార్‌ చేపట్టాడు. వరుసగా రెండు విజయాలతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మంచి జోరు మీద ఉంది. ఇప్పటివరకూ మూడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్‌ రెండు విజయాలతో పాయింట్ల పట్టికలోమూడో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో ఐదో​ స్థానంలో ఉంది. సొంతగడ్డపైనే కాకుండా బయటి వేదికలోనూ సత్తా చాటి తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. మరొకవైపు ఓపెనర్లు అందిస్తోన్న శుభారంభాన్ని తుదకంటా కొనసాగించి మళ్లీ గెలుపు బాట పట్టేందుకు ఢిల్లీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ఓటమితో టోర్నీని ఆరంభించినప్పటికీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పుంజుకుంది. సొంతగడ్డపై రెండు వరుస విజయాలు సాధించి దూసుకెళ్తోంది. వార్నర్‌ విధ్వంసానికి తాజాగా బెయిర్‌ స్టో కూడా జతకలవడంతో రైజర్స్‌ బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తోంది. ఈ ఓపెనింగ్‌ జోడీ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ 100కు పైగా భాగస్వామ్యాలను నెలకొల్పడం విశేషం. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీ చేసిన వార్నర్‌ గత మ్యాచ్‌లో సెంచరీతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ రాణిస్తుండటం గమనించాల్సిన విషయం. బౌలింగ్‌లో అఫ్గాన్‌ స్పిన్నర్లు రషీద్‌ఖాన్, నబీ దుమ్మురేపుతున్నారు. పేసర్‌ సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌ తమ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. కానీ పేసర్‌ భువనేశ్వర్‌ చివరి ఓవర్లలో అధికంగా పరుగులు ఇవ్వడం జట్టును కలవరపరుస్తోంది.  

ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వేధిస్తోన్న అంశం మిడిలార్డర్‌ వైఫల్యం. ఓపెనర్లు అందిస్తోన్న మంచి ఆరంభాలను మిడిలార్డర్‌ అందిపుచ్చుకోలేకపోవడంతో గెలుపు ముంగిట ఢిల్లీ బోల్తా పడుతోంది. తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్, పటిష్ట ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఢిల్లీ ఆత్మవిశ్వాసంతో సీజన్‌ను ప్రారంభించింది. కానీ మిడిలార్డర్‌ వైఫల్యంతో చెన్నైతో మ్యాచ్‌ను ఓడిపోయింది.  కోల్‌కతాతో గెలవాల్సిన మ్యాచ్‌ను టై చేసుకుంది. చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయలేక సూపర్‌ ఓవర్‌ ఆడాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. తర్వాత రబడ అద్భుత ప్రతిభ కారణంగా ఎట్టకేలకు గెలుపును అందుకుంది. పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లోనూ 8 పరుగుల వ్యవధిలో 7 వికెట్లను కోల్పోయి ఓటమిని ఆహ్వానించింది. మరోవైపు సీనియర్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు యువ రిషభ్‌ పంత్, పృథ్వీషా రాణిస్తుండటం జట్టు హర్షించదగ్గ విషయం. అయితే గత ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరఫున ఆడిన ధావన్‌.. ఇప్పుడు ప్రత్యర్థి ఢిల్లీ జట్టులో ఉన్నాడు. దాంతో అందరి చూపు ధావన్‌పైనే ఉంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌

శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, ఇన్‌గ్రామ్‌, క్రిస్‌ మోరిస్‌, అక్షర్‌ పటేల్‌, రాహుల్‌ తెవాతియా, రబడా, లామ్‌చెన్‌, ఇషాంత్‌ శర్మ

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

భువనేశ్వర్‌ కుమార్‌(కెప్టెన్‌), జానీ బెయిర్‌ స్టో, డేవిడ్‌ వార్నర్‌, విజయ్‌ శంకర్‌, యూసఫ్‌ పఠాన్‌, మనీష్‌ పాండే, దీపక్‌ హుడా, రషీద్‌ ఖాన్‌, మహ్మద్‌ నబీ, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌


 

>
మరిన్ని వార్తలు