సన్‌ ‘షాక్‌’నుంచి కోలుకునేనా!

8 Apr, 2019 06:58 IST|Sakshi

నేడు మొహాలిలో కింగ్స్‌ ఎలెవన్‌

పంజాబ్‌తో హైదరాబాద్‌ పోరు

డేవిడ్‌ వార్నర్, జానీ బెయిర్‌స్టో...ఈ సీజన్‌లో ఇద్దరు సన్‌రైజర్స్‌ ఓపెనర్లు పోటీ పడి పరుగుల వరద పారించారు. ఫలితంగా సన్‌రైజర్స్‌ అద్భుత విజయాలతో దూసుకుపోయింది. కానీ వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో విఫలమైతే? పరిస్థితి ఎలా ఉంటుందో గత మ్యాచ్‌ చూపించింది. సొంతగడ్డపై కూడా ముంబైకి పోటీనివ్వలేక కుప్పకూలిన రైజర్స్‌ ఐపీఎల్‌లోతమ అత్యల్ప స్కోరుకు పరిమితమైంది. ఇలాంటి ఫలితం తర్వాత సన్‌ తిరిగి సత్తా చాటగలదా...కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిపించే బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరం.  

మొహాలి: లీగ్‌లో వరుసగా చక్కటి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ముంబై ఇండియన్స్‌ బ్రేకులు వేసింది. మరో వైపు చెన్నైతో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చిన పంజాబ్‌ చివర్లో బోల్తా కొట్టింది. ఇప్పుడు ఈ రెండు టీమ్‌లు ప్రత్యర్థులుగా తలపడబోతున్నాయి. సొంత మైదానంలో ఆడబోతుండటం పంజాబ్‌కు అనుకూలత కాగా...సన్‌ తమ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల్సి ఉంది.  

మార్పులుంటాయా...
గత మ్యాచ్‌లో ఘోరంగా ఓడినా... సన్‌రైజర్స్‌ తమకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ జట్టునే బరిలోకి దించింది. కాబట్టి ఒక్కసారిగా మార్పులు కూడా ఊహించలేం. గెలుపు అవకాశాలు ఉండాలంటే ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో మరోసారి శుభారంభం అందించాల్సి ఉంది. ఎందుకంటే తర్వాతి ఆటగాళ్లలో ఎవరూ విజయంపై భరోసా ఇవ్వలేకపోతున్నారు. వరల్డ్‌ కప్‌ జట్టులో చోటు ఆశిస్తున్న విజయ్‌ శంకర్‌ గత మ్యాచ్‌లో బాధ్యతారహితంగా ఆడాడు. అతను కీలక పాత్ర పోషించాలి. ఆ తర్వాత మిడిలార్డర్‌పైనే సందేహాలు ఉన్నాయి. గత సీజన్‌నుంచి కూడా యూసుఫ్‌ పఠాన్, మనీశ్‌ పాండే, దీపక్‌ హుడా ఏమాత్రం ప్రభావం చూపలేదు. వీరిలో ఒకరి స్థానంలో రికీ భుయ్‌లాంటి యువ ఆటగాడికి మ్యాచ్‌ దక్కే అవకాశం ఉంది. పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్‌గా సాహాను కూడా పరీక్షించేందుకు సన్‌ ముందు అవకాశం ఉంది. ఆల్‌రౌండర్‌ నబీ సన్‌రైజర్స్‌ తరఫున ఆడి తొలి సారి ఓటమి పక్షాన నిలిచాడు. అయితే అతనితో పాటు రషీద్‌ ఖాన్‌ కూడా ఖాయం కాబట్టి నలుగురు విదేశీ ఆటగాళ్ల విషయంలో సందేహం లేదు. ముగ్గురు ప్రధాన పేసర్లతో ఆడుతున్న రైజర్స్‌కు మొహాలి పిచ్‌ అనుకూలంగా ఉంటుంది. వీరిలో సిద్ధార్థ్‌ కౌల్, సందీప్‌శర్మలకు  అది సొంత మైదానం కావడం విశేషం. ఇక భువనేశ్వర్‌ కూడా తన స్థాయికి తగినట్లుగా ఆడితే పేసర్లే మ్యాచ్‌ గెలిపించవచ్చు. 

పంజాబ్‌ ఏం చేస్తుందో...
చెన్నైతో మ్యాచ్‌లో సాధారణ లక్ష్యాన్ని ఛేదిస్తూ కూడా పంజాబ్‌ గెలుపు గీత దాటలేకపోయింది. అర్ధ సెంచరీలు సాధించినా... రాహుల్, సర్ఫరాజ్‌ ఖాన్‌ ధాటిగా ఆడకపోవడమే అందుకు కారణం. ఈ తప్పును సరిదిద్దుకుంటే జట్టు బ్యాటింగ్‌ బలంగా మారుతుంది. మయాంక్‌ అగర్వాల్‌ కూడా చక్కగా రాణిస్తుండగా... క్రిస్‌ గేల్‌ లీగ్‌ ఆరంభ దశలో చూపించిన దూకుడును మళ్లీ ప్రదర్శిస్తే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. మిల్లర్‌ కూడా తన స్థాయికి తగ్గట్లు మెరుపులు మెరిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక పంజాబ్‌ కొత్త హీరో స్యామ్‌ కరన్‌కు ఈ పిచ్‌ సరిగ్గా సరిపోతుంది. భారత బౌలర్‌ షమీ, ఆండ్రూ టై కూడా రాణించాలని అశ్విన్‌ సేన కోరుకుంటోంది. అశ్విన్‌ కూడా గత మ్యాచ్‌ లాగే తన బౌలింగ్‌తోనూ      ఆకట్టుకుంటే ఆ టీమ్‌ ఖాతాలో మరో విజయం చేరుతుంది. 

మరిన్ని వార్తలు