రషీద్‌ రఫ్ఫాడించాడు

26 May, 2018 01:00 IST|Sakshi

ఒంటిచేత్తో సన్‌రైజర్స్‌ను గెలిపించిన ఆల్‌రౌండర్‌

క్వాలిఫయర్‌–2లో నైట్‌రైడర్స్‌పై 14 పరుగులతో విజయం

ఐపీఎల్‌–11 ఫైనల్లో హైదరాబాద్‌ జట్టు

రేపు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో టైటిల్‌ పోరు  

సన్‌రైజర్స్‌ కిరణాల వెలుగుల ముందు నైట్‌రైడర్స్‌ తేలిపోయింది. చాప కింద నీరులా పనిచేసుకుంటూ పోయిన హైదరాబాద్‌... కోల్‌కతాను కొండచిలువలా మెల్లగా చుట్టేసింది. బౌలింగ్‌లో చివరి 2 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్న దినేశ్‌ కార్తీక్‌ జట్టు... ఛేజింగ్‌ చివర్లో 12 బంతుల్లో 30 పరుగులు చేయలేకపోయింది. దీంతో ఐపీఎల్‌–11లో ఆ జట్టు ప్రయాణం క్వాలిఫయర్‌–2 వద్ద ఆగిపోయింది. దూకుడైన బ్యాటింగ్, మిస్టరీ బౌలింగ్, మెరుపు ఫీల్డింగ్‌తో రషీద్‌ ఖాన్‌ అంతా తానై సన్‌రైజర్స్‌ను తుది పోరుకు చేర్చాడు.  

కోల్‌కతా: సన్‌రైజర్స్‌పై టాస్‌ గెలిచినా బ్యా టింగ్‌ తీసుకోకపోవడమే పొరపాటు అనుకుంటే... వారిపై ఛేదన ఎంత కష్టమో తెలిసీ నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌లో తప్పులు చేసింది. మ్యాచ్‌లో ఎక్కువ భాగం ఆ జట్టే ఆధిపత్యం చలాయించినా, ఒకే ఒక్కడు రషీద్‌ ఖాన్‌ (10 బంతుల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు; 3/19) అటు బ్యాట్, ఇటు బంతితో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. రెండు జట్ల మధ్య శుక్రవారం ఇక్కడ జరిగిన రెండో క్వాలిఫయర్‌లో ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా (27 బంతుల్లో 35; 5 ఫోర్లు), శిఖర్‌ ధావన్‌ (24 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగైన ఆరంభం... ముగింపులో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ మెరుపు ఇన్నింగ్స్‌ తోడవడంతో హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఛేదనలో టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ లిన్‌ (31 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్‌ నరైన్‌ (13 బంతుల్లో 26; 4 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్‌ రాణా (16 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్‌లు) బాగానే ఆడినా... మిడిలార్డర్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (20 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మినహా మిగతావారు విఫలం కావడంతో కోల్‌కతా 9 వికెట్లు కోల్పోయి 160 పరుగులే చేయగలిగింది. దీంతో 14 పరుగులతో సన్‌రైజర్స్‌ గెలుపొందింది. ఆ జట్టు ఆదివారం ముంబైలో చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఫైనల్లో తలపడనుంది. 

ఆరంభం వారిది... ముగింపు రషీద్‌ది 
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ప్రారంభం, ముగింపు తప్ప మిగతా ఆటంతా సాధారణమే. ధావన్, సాహా నిలకడగా ఆడారు. పవర్‌ ప్లే ముగిసేసరికి స్కోరు 45/0. అయితే 8వ ఓవర్లో కుల్దీప్‌ మాయ చేశాడు. ధావన్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న అతడు... చక్కటి బంతితో కెప్టెన్‌ విలియమ్సన్‌(3)ను పెవిలియన్‌ చేర్చాడు. సాహా... క్రీజు వదలి వచ్చి స్టంపౌటయ్యాడు. షకీబ్‌ (24 బంతుల్లో 28; 4 ఫోర్లు), హుడా (19) వేగంగా ఆడలేకపోయారు.  బ్రాత్‌వైట్‌ (8)... నితీశ్‌ రాణా అద్భుత ఫీల్డింగ్‌తో రనౌటయ్యాడు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా అవుటై... 138/6తో ఉన్న హైదరాబాద్‌కు రషీద్‌ తన స్ట్రోక్‌ ప్లేతో ఊహించనంతటి స్కోరందించాడు. 18వ ఓవర్‌ చివరి బంతిని బౌండరీకి పంపిన అతడు... మావి వేసిన 19వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టా్టడు. చివరి ఓవర్లో ఫోర్, రెండు సిక్స్‌లతో ప్రసిధ్‌కు చుక్కలు చూపాడు. భువీ కూడా ఫోర్‌ కొట్టడంతో ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి. 

గెలుపు దారిలో బోల్తా... 
నరైన్‌ మెరుపులతో కోల్‌కతా ఛేదన ఘనంగానే ప్రారంభమైంది. భువీ వేసిన 3వ ఓవర్లో మూడు ఫోర్లు, సిక్స్‌ కొట్టిన అతడు 19 పరుగులు రాబట్టాడు. దీంతో మూడు ఓవర్లలోనే 38 పరుగులొచ్చాయి. అయితే నరైన్‌ జోరుకు కౌల్‌ బ్రేక్‌ వేశాడు. లిన్, రాణా దూకుడుతో పవర్‌ ప్లే అనంతరం స్కోరు 67/1కు చేరింది. అయితే అనవసర పరుగుకు యత్నించి రాణా రనౌటయ్యాడు.  రషీద్‌ బంతిని రివర్స్‌ స్వీప్‌కు యత్నించి ఉతప్ప (2), షకీబ్‌ బౌలింగ్‌లో కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌(8) బౌల్డయ్యారు. రషీద్‌ ధాటిని స్వీప్‌లతో ఎదుర్కొంటున్న లిన్‌... మరోసారి అలాగే ప్రయత్నించబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. 14 బంతుల వ్యవధిలో ముగ్గురు కీలక బ్యాట్స్‌మెన్‌ ఔటవ్వడంతో కోల్‌కతా కోలుకోలేకపోయింది. రసెల్‌ (3)ను స్పిన్నర్లు కట్టిపడేశారు. అప్పటికి సమీకరణం 32 బంతుల్లో 57. గిల్, చావ్లా (12)లు ఖలీల్‌ ఓవర్లో 14 పరుగులు పిండుకుని లక్ష్యాన్ని కొంత కరిగించారు. కానీ కౌల్‌ 17వ ఓవర్లో 4 పరుగులే ఇచ్చి సంక్లిష్టం చేశాడు. 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సిన స్థితిలో భువీ 9, కౌల్‌ 11 పరుగులిచ్చారు. దాంతో కోల్‌కతా విజయానికి చివరి ఓవర్లో 19 పరుగులు అవసరమయ్యాయి. బ్రాత్‌వైట్‌ వేసిన చివరి ఓవర్‌ తొలి బంతినే మావి (6) ఫోర్‌ కొట్టి ఉత్కంఠ రేపాడు. అయితే, వరుస బంతుల్లో అతడితో పాటు శుబ్‌మన్‌ గిల్‌ భారీ షాట్లకు యత్నించి ఔటవ్వడంతో నైట్‌రైడర్స్‌కు నిరాశే మిగిలింది. గత మ్యాచ్‌లో చెన్నైపై బౌలింగ్‌ వ్యూహ లోపంతో విమర్శలెదుర్కొన్న విలియమ్సన్‌... ఈసారి రషీద్, భువనేశ్వర్‌లను సరైన సమయంలో దింపి విజయాన్ని ఒడిసిపట్టాడు. 

అంతా అతనొక్కడే... 
ప్రతి ఆటగాడికి ఒక ప్రత్యేక రోజుంటుంది. అప్పుడు ఎటుచూసినా, ఏం జరిగినా వారే కనిపిస్తుంటారు. అలాంటి రోజు శుక్రవారం రషీద్‌ ఖాన్‌కు వచ్చింది. ఐపీఎల్‌ క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో ఆడింది 22 మంది ఆటగాళ్లైతే... అభిమానులకు మాత్రం అతనొక్కడే కనిపించాడు. హైదరాబాద్‌ స్కోరు 150 దాటుతుందని అనుకోని దశలో పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడ్డ రషీద్, ప్రత్యర్థి విజయం వైపు సాగుతుండగా స్పిన్‌తో కట్టిపడేశాడు. ఫీల్డింగ్‌లో చురుగ్గా కదిలి... కీలకమైన నితీశ్‌ రాణా రనౌట్‌లో భాగమయ్యాడు. చివరి ఓవర్లో బౌండరీ లైన్‌ వద్ద రెండు క్యాచ్‌లను అందుకుని మ్యాచ్‌ను తమ జట్టు వైపు తిప్పేశాడు. అంతకుముందు బ్యాటింగ్‌లో క్రీజు బయటకొచ్చి, మోకాలును వంచుతూ స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ స్థాయి టైమింగ్‌తో ఆడిన రషీద్‌... కవర్స్‌ ప్రాంతంలో మూడు ముచ్చటైన సిక్స్‌లు కొట్టడం విశేషం. ఇక ఫ్లిక్‌తో స్వే్కర్‌ లెగ్‌ మీదుగా తను బాదిన సిక్స్‌ మ్యాచ్‌కే హైలైట్‌.  

మరిన్ని వార్తలు