ప్రతీకారం తీర్చుకుంటారా!

30 Apr, 2016 14:54 IST|Sakshi
ప్రతీకారం తీర్చుకుంటారా!

నేడు బెంగళూరుతో హైదరాబాద్ మ్యాచ్
 
హైదరాబాద్: ఒక జట్టులో చూస్తే విధ్వంసకర బ్యాట్స్‌మెన్... కలిసికట్టుగా చెలరేగితే ఆకాశమే హద్దు... మరో జట్టులో అత్యుత్తమ బౌలర్లు... ప్రత్యర్థిని కట్టడి చేయడంలో నిలకడైన రికార్డు... ఇప్పు డు ఈ రెండు జట్ల మధ్య సీజన్‌లో రెండో సమరానికి రంగం సిద్ధమైంది. శనివారం  రాత్రి గం. 8.00లకు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగే కీలక మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య ఈ నెల 12న బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో రైజర్స్ 45 పరుగుల తేడాతో ఓడింది.

మిడిలార్డర్ మెరుగు పడేనా...

కెప్టెన్ డేవిడ్ వార్నర్ సన్‌రైజర్స్ జట్టు బలమూ, బలహీనతగా మారాడు. అద్భుతమైన ఆటతీరుతో నాలుగు అర్ధ సెంచరీలు చేసిన వార్నర్ విఫలమైతే అది జట్టుపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. గత మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. ధావన్ ఫామ్‌లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్నా, గత రెండు ఇన్నింగ్స్‌లలో అతను చాలా నెమ్మదిగా ఆడాడు. జట్టు భారీ స్కోరు సాధించాలంటే ఇది సరిపోదు. వీరిద్దరి తర్వాత వచ్చే ఆటగాళ్లెవరూ నిలకడ చూపించకపోవడంతో జట్టు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

హెన్రిక్స్, మోర్గాన్, హుడా, నమన్ ఓజాలలో ఎవరూ ఒక్కసారి కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఆదిత్య తారేను వరుసగా మూడు మ్యాచ్‌లలో రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌గా ఆడించిన ప్రయోగం ఫలితాలివ్వలేదు. తొలి రెండు వికెట్లు పడితే ఆ తర్వాత సన్ పనైపోయినట్లే అనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లోనైనా బ్యాట్స్‌మెన్ సమష్టిగా చెలరేగితేనే రైజర్స్ గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చు. మంచి స్కోరు ఉంటే దానిని కాపాడుకోగల బౌలింగ్ వనరులు జట్టుకు ఉన్నాయి. నెహ్రా, ముస్తఫిజుర్, భువనేశ్వర్ ప్రత్యర్థిని అడ్డుకోగల సమర్థులు. అయితే సాధారణ స్కోరు ఉంటే వీరు కూడా ఏమీ చేయలేరని పుణేతో మ్యాచ్ నిరూపించింది. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ స్థానంలో విలియమ్సన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

గేల్ మెరుపులు చూస్తామా...

 గేల్, కోహ్లి, డివిలియర్స్, వాట్సన్... ఇలా వీర బాదుడు ఆటగాళ్లతో రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. టోర్నీలో దాదాపు ఆడిన ప్రతీ మ్యాచ్‌లో కోహ్లి, డివిలియర్స్ చెలరేగడంతో బెంగళూరు భారీ స్కోర్లు సాధిస్తోంది. వాట్సన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. అయితే ఈ ఐపీఎల్‌లో క్రిస్ గేల్‌నుంచి అతని స్థాయి ఇన్నింగ్స్ ఇంకా రాలేదు. రెండు మ్యాచ్‌లే ఆడిన అతను 1, 0 పరుగులు చేశాడు. కూతురు జన్మించడంతో వెస్టిండీస్ వెళ్లిన గేల్ తిరిగొచ్చి జట్టుతో కలిశాడు. శుక్రవారం నెట్స్‌లో అందరికంటే ముందుగా వచ్చి గేల్ సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. అతను తనదైన శైలిలో ఆడితే అతడిని అడ్డుకోవడం సన్‌రైజర్స్ బౌలర్లకు అసాధ్యంగా మారుతుంది. కోహ్లి ఫామ్ ఆ జట్టుకు పెద్ద బలం.

గత మ్యాచ్‌లో సెంచరీ చేసినా జట్టు ఓటమి పాలవడంతో నిరాశ చెందిన విరాట్, ఈసారి దానిని సరిదిద్దుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. లోయర్ ఆర్డర్‌లో సర్ఫరాజ్ మెరుపులు కూడా జట్టుకు కీలకం. అయితే ఎంత మంది హిట్టర్లు ఉన్నా బలహీన బౌలింగ్‌తో ఆర్‌సీబీ మ్యాచ్‌లు కోల్పోతోంది. స్ట్రైక్ బౌలర్‌గా చెప్పుకోదగ్గ ఆటగాడు ఎవరూ ఆ జట్టులో కనిపించడం లేదు. కేన్ రిచర్డ్సన్ ప్రభావం అంతంత మాత్రమే కాగా, వరుణ్ ఆరోన్ పూర్తిగా విఫలమయ్యాడు. చహల్, అబ్దుల్లాలాంటి దేశవాళీ స్పిన్నర్లు, పార్ట్‌టైమర్లతోనే జట్టు నెట్టుకొస్తోంది. గేల్ తుది జట్టులోకి వస్తే స్పిన్నర్ తబ్రేజ్ షమ్సీని పక్కన పెట్టవచ్చు.

వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరిగిన గత మ్యాచ్ ప్రేక్షకులకు కాస్త నిరాశను పంచింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లలో కూడా భారీ స్కోర్లేమీ నమోదు కాలేదు. ఈసారైనా బెంగళూరు స్టార్ల జోరుతో బౌండరీల మోత, సిక్సర్ల హోరు కనిపించాలని, పూర్తి వినోదం దక్కాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అన్నింటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ మ్యాచ్‌కు ఎప్పుడో టికెట్లన్నీ అమ్ముడుపోగా... వారాంతం కావడం వల్ల కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు