సన్‌ ధనాధన్‌

22 Apr, 2019 01:47 IST|Sakshi

చెలరేగిన బెయిర్‌స్టో, వార్నర్‌

కట్టడి చేసిన ఖలీల్‌ అహ్మద్‌

కోల్‌కతాపై 9 వికెట్లతో సన్‌రైజర్స్‌ గెలుపు

15 ఓవర్లలోనే లక్ష్య ఛేదన

సన్‌రైజర్స్‌ పుంజుకుంది. సొంతగడ్డపై మరో గెలుపు అందుకుంది. వార్నర్, బెయిర్‌స్టో మెరుపులకు... యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ నిప్పులు చెలరేగే బంతులు తోడవ్వడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై రైజర్స్‌ పైచేయి సాధించింది. బాదడమే లక్ష్యమన్నట్లుగా బరిలోకి దిగుతోన్న వార్నర్‌–బెయిర్‌స్టో జోడీ మరో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన వేళ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చిన్నబోయింది.  

సాక్షి, హైదరాబాద్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్లీ జోరు కనబరుస్తోంది. ఓ దశలో హ్యాట్రిక్‌ ఓటములతో డీలా పడిన రైజర్స్‌... మళ్లీ విజయాల బాట పట్టింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి హైదరాబాద్‌ ఐదో విజయాన్ని నమోదు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. క్రిస్‌ లిన్‌ (47 బంతుల్లో 51; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీ చేశాడు. సునీల్‌ నరైన్‌ (8 బంతుల్లో 25; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), రింకూ సింగ్‌ (25 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.

యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ 3 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం హైదరాబాద్‌ కేవలం 15 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 161 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌ (38 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు), బెయిర్‌స్టో (43 బంతుల్లో 80 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కోల్‌కతాకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆంధ్ర పేసర్‌ పృథ్వీరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఖలీల్‌ అహ్మద్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారాన్ని అందుకున్నాడు.  

అదిరిపోయిన ఆరంభం... 
తొలి ఓవర్‌లోనే రెండు బౌండరీలతో కోల్‌కతా ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. నదీమ్‌ వేసిన రెండో ఓవర్‌లో లిన్‌ 4, 6... నరైన్‌ 6 బాదడంతో నైట్‌రైడర్స్‌ 18 పరుగులు రాబట్టింది. ఖలీల్‌ వేసిన మూడో ఓవర్‌లో మరింతగా చెలరేగిన నరైన్‌ చివరికి అతనికే చిక్కి పెవిలియన్‌ చేరాడు. తొలి మూడు బంతుల్లో 6, 4, 4 బాది నాలుగో బంతికి ఔటయ్యాడు. దీంతో 16 బంతుల్లోనే నైట్‌రైడర్స్‌ తొలి వికెట్‌కు 42 పరుగుల్ని జోడించింది.  

ఆదుకున్న లిన్‌... 
నరైన్‌ ఔటయ్యాక హైదరాబాద్‌ బౌలర్లు కోల్‌కతాపై ఒత్తిడి పెంచారు. క్రీజులోకి వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ (3)ను ఖలీల్‌ ఔట్‌ చేయగా... నితీశ్‌ రాణా (11) భువీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కొద్దిసేపటికే కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (6) రనౌటయ్యాడు. దీంతో 73 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయి కోల్‌కతా ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. ఈ దశలో లిన్, రింకూ సింగ్‌ బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పెంచారు. సందీప్‌ ఓవర్‌లో లిన్‌ బౌండరీ బాదగా... రింకూ సిక్సర్‌తో అలరించాడు. దీంతో 15 ఓవర్లకు కోల్‌కతా స్కోరు 116/4. తర్వాత వేగంగా ఆడేందుకు ప్రయత్నించిన రింకూ సింగ్‌ సందీప్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి మరుసటి బంతికే ఔటయ్యాడు.

అప్పటి వరకు సింగిల్స్‌కే మొగ్గుచూపుతూ 45 బంతుల్లో బౌండరీతో అర్ధశతకాన్ని అందుకున్న లిన్‌ కూడా విలియమ్సన్‌ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్‌ చేరాడు. 18వ ఓవర్‌ వేసిన రషీద్‌ కేవలం ఒకే పరుగు ఇచ్చి స్కోరును కట్టడి చేశాడు. 19వ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లతో స్కోరు పెంచే ప్రయత్నం చేసిన రసెల్‌ (9 బంతుల్లో 15; 2 సిక్సర్లు)ను భువీ ఔట్‌ చేశాడు. చివరి ఓవర్‌లో కరియప్ప (3 బంతుల్లో 9; 1 సిక్స్‌) సిక్స్‌ బాదడంతో కోల్‌కతా 150 పరుగులు దాటగలిగింది.  

మళ్లీ వారిద్దరే.. 
అరంగేట్ర బౌలర్‌ పృథ్వీరాజ్‌ వేసిన రెండో ఓవర్‌లో వార్నర్‌ సిక్సర్‌తో రైజర్స్‌ మెరుపులు మొదలయ్యాయి. అదే ఓవర్‌లో బెయిర్‌స్టో రెండు బౌండరీలతో చెలరేగాడు. చావ్లా ఓవర్‌లో 4, 6తో అతను 11 పరుగులు రాబట్టాడు. ఇక తనవంతు అన్నట్లుగా నరైన్‌ ఓవర్‌లో భారీ సిక్సర్‌గా బాదిన వార్నర్‌... కరియప్పకు 6, 4, 6తో చుక్కలు చూపించాడు. దీంతో పవర్‌ప్లేలో రైజర్స్‌ 72 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓవర్‌కు కనీసం ఒక బౌండరీ, లేదా సిక్సర్‌ అన్నట్లుగా వీరిద్దరూ బ్యాట్‌ ఝళిపించారు. పాపం కరియప్ప ఈసారి బెయిర్‌స్టోకు దొరికిపోయాడు. అతను వేసిన తొమ్మిదో ఓవర్‌ తొలి రెండు బంతుల్లో సిక్స్, ఫోర్‌ బాదిన బెయిర్‌స్టో నాలుగో బంతికి సింగిల్‌ తీశాడు.

దీంతో ఈ సీజన్‌లో వార్నర్‌–బెయిర్‌స్టో జోడీ నాలుగో సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. ఈ క్రమంలో వార్నర్, బెయిర్‌స్టోలిద్దరూ 28 బంతుల్లోనే అర్ధశతకాల్ని అందుకున్నారు. దీంతో 10 ఓవర్లలో జట్టు స్కోరు 109కి చేరింది. తర్వాత నరైన్‌ బౌలింగ్‌లో వార్నర్‌ వరుసగా 4, 6తో జోరు కనబరిచాడు. కానీ మరుసటి ఓవర్‌లోనే పృథ్వీరాజ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఈ దశలో జట్టు విజయానికి 46 బంతుల్లో 29 పరుగులు అవసరం. మరోవైపు 12, 13 ఓవర్లలో రెండుసార్లు ఔటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న బెయిర్‌స్టో... విలియమ్సన్‌ (8) అండతో 15వ ఓవర్‌లో చెలరేగిపోయాడు. చావ్లా బౌలింగ్‌లో వరుసగా మూడు బంతుల్లో 4, 6, 6 బాది మరో 30 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను ముగించాడు.  

>
మరిన్ని వార్తలు