పుణే దూకుడు కొనసాగేనా?

11 May, 2017 22:31 IST|Sakshi
పుణే దూకుడు కొనసాగేనా?

నేడు ఢిల్లీతో తలపడనున్న సూపర్‌జెయింట్‌
పటిష్టంగా పుణే
డేర్‌డెవిల్స్‌ అస్థిర ప్రదర్శన


న్యూఢిల్లీ :వరుస విజయాలతో జోరుమీదున్న రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ శుక్రవారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపుమీదున్న పుణే.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని కృతనిశ్చయంతో ఉంది. మరోవైపు చివరిమ్యాచ్‌లో కోల్‌కతాపై అద్భుత విజయం సాధించిన ఢిల్లీ తన విజయమంత్రాన్ని కొనసాగించాలని భావిస్తోంది.

జోరుమీదున్న పుణే..
గతేడాది ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ చెత్త ఆటతీరుతో ఆ సీజన్‌లో అట్టడుగున ఏడోస్థానంలో నిలిచింది. అయితే ఈ  సీజన్‌లో పుణే దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు నమోదు చేసింది. ముఖ్యంగా చివరగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు నమోదు చేయడం విశేషం. ఓవరాల్‌గా 16 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో నిలిచింది.  సన్‌రైజర్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో 148 పరుగుల ఓ మాదిరి స్కోరునే చేసినా.. బౌలర్లు ఆకట్టుకోవడంతో అద్భుతవిజయం సాధించింది. ముఖ్యంగా జయదేవ్‌ ఉనాద్కట్‌ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.  హ్యాట్రిక్‌తో సన్‌రైజర్స్‌ను కకావికలం చేశాడు.

ఢిల్లీతో మ్యాచ్‌లోనూ తను ఇదే విధంగా రాణించాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. 11 మ్యాచ్‌ల్లో 367 పరుగులతో జట్టు తరఫున అత్యధిక పరుగులు నమోదు చేశాడు. మరోవైపు ఈ సీజన్‌లో అరంగేట్రం చేసిన కుర్ర సంచలనం రాహుల్‌ త్రిపాఠి ఆకట్టుకుంటున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 353 పరగులు చేశాడు. బెన్‌ స్టోక్స్‌ (283 పరుగులు), అజింక్య రహానే (248), భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని (235 పరుగులు) ఆకట్టుకుంటున్నారు. మనోజ్‌ తివారీ, డాన్‌ క్రిస్టియన్‌ తమ బ్యాట్లకు పదును పెట్టాల్సి ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే దక్షిణాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహిర్‌ అంచనాలకు మించి రాణించాడు. మొత్తం 12 మ్యాచ్‌లాడిన తాహిర్‌ 18 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఉనాద్కట్‌ (17 వికెట్లు), బెన్‌ స్టోక్స్‌ (10) ఆకట్టుకుంటున్నారు. డాన్‌ క్రిస్టియాన్, శార్ధుల్‌ ఠాకూర్, వాషింగ్టన్‌ సుందర్‌ సత్తాచాటాల్సి ఉంది. మరోవైపు గత సీజన్‌లో ఇరుజట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరుగగా అందులో పుణేనే విజయం సాధించింది. అయితే ఈ సీజన్‌లో ఇరుజట్లు పరస్పరం తలపడగా.. 97 పరుగులతో పుణే ఘనవిజయం సాధించింది. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి ప్రతీకారం తీర్చుకోవడంతోపాటు నాకౌట్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోవాలని పుణే భావిస్తోంది. జట్టు ఆటతీరు చూస్తే ఈ మ్యాచ్‌లో పుణేనే ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.

ఢిల్లీ పడుతూ లేస్తూ..: ఈ సీజన్‌లో అత్యంత అస్థిరప్రదర్శన కనబర్చే జట్టు ఏదైనా ఉందంటే అది ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ అనడంలో సందేహం లేదు. ఒక మ్యాచ్‌లో 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ మరోమ్యాచ్‌లో 66 పరుగులకే కుప్పకూలడం ఢిల్లీ విషయంలో మాత్రమే సాధ్యమవుతోంది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లాడిన ఢిల్లీ 5 విజయాలు, 7 పరాజయాలు నమోదు చేసింది. దీంతో 10 పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్‌ లయన్స్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో ఢిల్లీ అద్భుత విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యాన్ని అద్భుత రీతిలో ఛేదించింది. శ్రేయస్‌ అయ్యర్‌ బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే సంజూ శామ్సన్, కరుణ్‌ నాయర్, శ్రేయస్‌ అయ్యర్, కోరీ అండర్సన్, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌లాంటి ఆటగాళ్లున్నా.. సమష్టిగా రాణించడం లేదు.

ఒక మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మెన్‌ విజయవంతమైతే మరో మ్యాచ్‌లో ఇంకో బ్యాట్స్‌మెన్‌ సత్తాచాటుతున్నాడు. జట్టుగా మాత్రం రాణించలేకపోతున్నారు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే సంజూ సామ్సన్‌ ఆకట్టుకున్నాడు. ఓవరాల్‌గా 12 మ్యాచ్‌ల్లో 384 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. తను ఆడిన చివరి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన సంజూ.. ఫామ్‌లోకొస్తే విధ్వంసక ఇన్నింగ్స్‌ ఆటగలడు. ఈ సీజన్‌లో ఓ సెంచరీ కూడా నమోదు చేశాడు. అది పుణేపైనే కావడం విశేషం. శుక్రవారం మ్యాచ్‌లో తను మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగడానికి ఇది తోడ్పడుతుంది.

శ్రేయస్‌ అయ్యర్‌ (303 పరుగులు), రిషభ్‌ పంత్‌ (285), కరుణ్‌ నాయర్‌ (191) ఆకట్టుకుంటున్నారు. మరోవైపు చాంపియన్స్‌ ట్రోఫీ కారణంగా క్రిస్‌ మోరిస్, కగిసో రబడ జట్టు నుంచి దూరమవడం ఢిల్లీకి ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే ప్యాట్‌ కమిన్స్‌ ఆకట్టుకుంఉటున్నాడు. 10 మ్యాచ్‌ల్లో 12 వికెట్లతో జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. క్రిస్‌ మోరిస్‌ కూడా 12 వికెట్లు తీయడం విశేషం. అమిత్‌ మిశ్రా (10 వికెట్లు), జహీర్‌ ఖాన్‌ (7) ఫర్వాలేదనిపిస్తున్నారు. లీగ్‌ తొలిదశలో పుణేపై భారీ విజయం సాధించిన ఢిల్లీ మరోసారి అదే తరహా ప్రదర్శన పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు గుజరాత్‌తోమ్యాచ్‌లో గాడిన పడిన ఢిల్లీ ఆ మ్యాచ్‌లోలాగే మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. 

>
మరిన్ని వార్తలు