పుణే సూపర్ విక్టరీ

27 Apr, 2016 06:57 IST|Sakshi
పుణే సూపర్ విక్టరీ

32 పరుగులకే కూలిన 5 వికెట్లు... ఒక దశలో 48 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా లేకపోవడం... హైదరాబాద్ బలహీన బ్యాటింగ్ ప్రదర్శనకు ఇది నిదర్శనం. ఫలితంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న జట్టుకు బ్రేక్ పడింది. ధావన్ ఒంటరి పోరు మినహా ఇతర ఆటగాళ్ల నుంచి కనీస ప్రదర్శన లేకపోవడంతో సొంతగడ్డపై వార్నర్ సేనకు పరాభవం ఎదురైంది.
 
ముందుగా బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శన, ఆ తర్వాత స్మిత్ సాధికారిక బ్యాటింగ్ కలగలిసి పుణేకు కొంత విరామం తర్వాత విజయం రుచి చూపించాయి. పరాజయాల పరంపరతో తీవ్ర ఒత్తిడిలో పడిన ధోని సేన ఎట్టకేలకు ఉప్పల్‌లో ఊపిరి పీల్చుకుంది.
 
* 34 పరుగులతో సన్‌రైజర్స్ చిత్తు  
* రాణించిన బౌలర్లు, స్మిత్

సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్ వైఫల్యంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ సొంత మైదానంలో పరాజయాన్ని మూటగట్టుకుంది. మంగళవారం ఇక్కడి ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ 34 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం) సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

శిఖర్ ధావన్ (53 బంతుల్లో 56 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేసే సమయానికి పుణే 11 ఓవర్లలో 3 వికెట్లకు 94 పరుగులు చేసింది.  స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 46 నాటౌట్; 7 ఫోర్లు), డు ప్లెసిస్ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 50 బంతుల్లోనే 80 పరుగులు జత చేశారు. పుణే బౌలర్ అశోక్ దిండాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం లభించింది.
 
ఆదుకున్న ధావన్...
గత మూడు మ్యాచ్‌లలో ఛేదనలో అద్భుతాలు చేసిన సన్‌రైజర్స్ ఈసారి తొలుత బ్యాటింగ్ చేస్తూ పూర్తిగా తడబడింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ వార్నర్ విఫలమైతే  ఒక్కసారిగా ఎలా కుప్పకూలుతుందో ఈ మ్యాచ్ చూపించింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వార్నర్ (0)ను అవుట్ చేసి అశోక్ దిండా దెబ్బ తీశాడు. ఆ తర్వాత క్యూ కట్టినట్లు ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా ఒకరి వెనక మరొకరు వెనుదిరిగారు. మూడో స్థానంలో వచ్చిన తారే (14 బంతుల్లో 8; 1 ఫోర్) ప్రభావం చూపించలేకపోగా, మోర్గాన్ (0), హుడా (1), హెన్రిక్స్ (1) విఫలమయ్యారు.

అయితే మరోవైపు రైజర్స్ జట్టు తరఫున అదృష్టవశాత్తూ ధావన్ నిలబడ్డాడు. ఆరంభంలో పరిస్థితిని బట్టి జాగ్రత్తగా ఆడిన ధావన్, ఆ తర్వాత మరింత బాధ్యతతో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కొంతవరకు నమన్ ఓజా (21 బంతుల్లో 18; 1 సిక్స్) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 51 బంతుల్లో 47 పరుగులు జోడించారు. 41 పరుగుల వద్ద రహానే క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధావన్, 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నారు. చివర్లో భువనేశ్వర్ (8 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడటంతో సన్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
 
కీలక భాగస్వామ్యం...
పుణే ఇన్నింగ్స్‌కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి రహానే (0) అవుటయ్యాడు. అయితే స్మిత్, డు ప్లెసిస్ కలిసి జెయింట్స్‌ను నడిపించారు. ముస్తఫిజుర్ వేసిన రెండు ఓవర్లలో కలిపి స్మిత్ నాలుగు ఫోర్లు బాది జోరు ప్రదర్శించడంతో  పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు స్కోరు 46 పరుగులకు చేరింది.

బిపుల్ వేసిన ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో పుణే 17 పరుగులు రాబట్టింది. ఇదే జోరులో భాగస్వామ్యం 80 పరుగులకు చేరిన అనంతరం హెన్రిక్స్, డు ప్లెసిస్‌ను అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అనంతరం ధోని (5) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అయితే స్మిత్ చక్కటి ఆటతో పుణేను విజయానికి చేరువగా తెచ్చాడు.
 
118
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కిది రెండో అత్యల్ప స్కోరు. గతేడాది ముంబైపై ఆ జట్టు అత్యల్పంగా 113 పరుగులు చేసింది.
 
2
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య. ఈ రెండు వికెట్లు మ్యాచ్‌లో అతను వేసిన తొలి బంతికే రావడం విశేషం.
 
29
సున్నా పరుగులకే వార్నర్ అవుటవ్వడం 29 ఇన్నింగ్స్‌ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఏప్రిల్ 27న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ డకౌట్ అయ్యాడు.
 
2
ఐపీఎల్‌లో ఓపెనర్‌గా వచ్చి మొత్తం ఓవర్లు ఆడి తక్కువ పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా శిఖర్ ధావన్ (56 నాటౌట్) నిలిచాడు. 2009లో బెంగళూరుపై దక్కన్ చార్జర్స్ ఓపెనర్ గిబ్స్ (53 నాటౌట్) అతి తక్కువ స్కోరు చేశాడు.
 
స్కోరువివరాలు :-
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: డేవిడ్ వార్నర్ (సి) రహానే (బి) అశోక్ దిండా 0; శిఖర్ ధావన్ (నాటౌట్) 56; ఆదిత్య తారే (సి) పెరీరా (బి) అశోక్ దిండా 8; ఇయాన్ మోర్గాన్ (సి) ధోని (బి) మిచెల్ మార్ష్ 0; దీపక్ హుడా (సి) ధోని (బి) ఆర్.అశ్విన్ 1; హెన్రిక్స్ (సి) ధోని (బి) మిచెల్ మార్ష్ 1; నమన్ ఓజా (బి) అశోక్ దిండా 18; బిపుల్ శర్మ (రనౌట్) 5; భువనేశ్వర్ కుమార్ (సి) డు ప్లెసిస్ (బి) పెరీరా 21; ఆశిష్ నెహ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు) 118.
వికెట్ల పతనం: 1-0, 2-26, 3-27, 4-29, 5-32, 6-79, 7-92, 8-115.
బౌలింగ్: అశోక్ దిండా 4-1-23-3, మిచెల్ మార్ష్ 4-0-14-2, తిసారా పెరీరా 4-0-32-1, ఆర్.అశ్విన్ 4-0-14-1, రజత్ భాటియా 3-0-24-0, ఎం.అశ్విన్ 1-0-6-0.
 
రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: అజింక్య రహానే (సి) మోర్గాన్ (బి) భువనేశ్వర్ కుమార్ 0; డు ప్లెసిస్ (సి) నమన్ ఓజా (బి) హెన్రిక్స్ 30; స్టీవెన్ స్మిత్ (నాటౌట్) 46; ధోని (సి) తారే (బి) నెహ్రా 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (11 ఓవర్లలో మూడు వికెట్లకు) 94.
వికెట్ల పతనం: 1-0, 2-80, 3-94.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 3-1-17-1, ఆశిష్ నెహ్రా 3-0-21-1, ముస్తఫిజుర్ రెహమాన్ 2-0-21-0, బిపుల్ శర్మ 1-0-17-0, హెన్రిక్స్ 2-0-16-1.

మరిన్ని వార్తలు