పంత్‌లో ధోనిని వెతకడం ఆపండి..

12 Mar, 2019 12:02 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గో వన్డేలో భారత్‌ భారీ స్కోరు చేసినా ఓటమి చెందడానికి ప్రధాన కారణం ఫీల్డింగ్‌ వైఫల్యమే. అందులోనూ మ్యాచ్‌ను ఆసీస్‌ వైపు లాగేసుకున్న ఆస్టన్‌ టర్నర్‌ను స్టంపింగ్‌ చేసే విషయంలో భారత యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్ చేసిన పొరపాట్లే హాట్‌ టాపిక్‌గా మారాయి. ఆస్టన్‌ టర్నర్‌ను రెండు సార్లు స్టంపింగ్‌ చేసే అవకాశం వచ్చినా రిషభ్‌ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ప్రధానంగా ఒక స్టంపింగ్‌ విషయంలో ధోనిని అనుకరించి విఫలం కావడం అభిమానులకు మరింత ఆగ్రహం తెప్పించింది. దాంతో స్టేడియం మొత్తం ‘ధోని-ధోని’  అంటూ మార్మోగిపోయింది. ఆ తర్వాత  సోషల్‌ మీడియాలో సైతం రిషభ్‌ పంత్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు నెటిజన్లు. ప్రతీ ఒక్కరూ ఎంఎస్‌ ధోనిలు కాలేరబ్బా అంటూ పంత్‌ను ఒక ఆట ఆడేసుకున్నారు.

అయితే తాజాగా పంత్‌కు ఊహించని మద్దతు లభించింది. బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టితో పాటు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాలు పంత్‌కు బాసటగా నిలిచారు. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్న పంత్‌ను ధోనితో పోల్చడం సరికాదని అంటున్నారు.  ‘ 21 ఏళ్ల వయసుకే భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో పంత్‌ ఆడుతున్నాడు. అతనొక యువ క్రికెటర్‌. అతని వయసులో మనం ఏం చేశామో ఒక్కసారి పరిశీలించుకుందాం. అతనికి ఒక చాన్స్‌ ఇవ్వండి. పంత్‌లో టాలెంట్ ఉంది. విమర్శలను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టమని పంత్‌ను కోరుతున్నా’ అని సునీల్‌ శెట్టి ట్వీట్‌ చేశాడు. ఇక ఆకాశ్‌ చోప్రా మరొక అడుగు ముందుకేసి.. ‘పంత్‌లో ధోని వెతకడం ఆపండి’ అంటూ మండిపడ్డాడు. ‘అతని ఆట ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. అప్పుడే పంత్‌ను ధోనితో పోలుస్తారెందుకు. పంత్‌ విలువైన ఆటగాడా అని అడిగితే కచ్చితంగా అవుననే సమాధానం చెబుతా’ అని చోప్రా ట్వీట్‌ చేశాడు.
(ఇక్కడ చదవండి: ధోని లేకపోవడం వల్లనే ఓటమి: మాజీ క్రికెటర్‌)

మరిన్ని వార్తలు