‘నలుగురి’తో నడిపిస్తారు

31 Jan, 2017 06:56 IST|Sakshi
‘నలుగురి’తో నడిపిస్తారు

బీసీసీఐకి కొత్త పాలకవర్గం
మాజీ ‘కాగ్‌’ వినోద్‌ రాయ్‌ నేతృత్వం
నలుగురు సభ్యుల కమిటీలో ఏకైక క్రికెటర్‌గా డయానా ఎడుల్జీ
సుప్రీం కోర్టు నిర్ణయం


న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వ్యవహారాల పర్యవేక్షణ కోసం కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. మాజీ కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) వినోద్‌ రాయ్‌ నేతృత్వంలో నలుగురు సభ్యుల కమిటీని సోమవారం సుప్రీం కోర్టు నియమించింది. జస్టిస్‌ ఆర్‌ఎం లోధా ప్యానెల్‌ సూచించిన ప్రతిపాదనల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. మిగతా ముగ్గురిలో క్రికెట్‌ చరిత్రకారుడు రామచంద్ర గుహ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐడీఎఫ్‌సీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ లిమాయే, భారత మహిళా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ డయానా ఎడుల్జీ ఉన్నారు. వీరిలో డయానాకు తప్ప క్రికెట్‌ ఆటతో ఎవరికీ సంబంధం లేకపోవడం గమనార్హం. ప్రస్తుత బోర్డు సీఈవో రాహుల్‌ జోహ్రి బోర్డుకు చెందిన రోజువారీ కార్యకలాపాల ఇన్‌చార్జిగా ఉంటారని జడ్జిలు దీపక్‌ మిశ్రా, ఏఎమ్‌ ఖన్‌విల్కర్, డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్‌ పేర్కొంది. ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ‘మార్పును చక్కగా కొనసాగించేందుకు బీసీసీఐలో నా పాత్ర నైట్‌ వాచ్‌మన్‌గా ఉంటుందని భావిస్తున్నాను. బోర్డు గురించి నాకు అవగాహన లేకపోయినా క్రికెట్‌ అంటే నాకు ఎంతో ఇష్టం’ అని వినోద్‌ రాయ్‌ అన్నారు.

వేతనం ఇవ్వాల్సిందే...
మరోవైపు కమిటీ సభ్యులుగా ఎంపికైనవారికి ఎటువంటి వేతనం ఇవ్వలేమని బీసీసీఐ తెలిపింది. తమ ఆఫీస్‌ బేరర్లు, పరిపాలకులు ఉచితంగానే పనిచేస్తారని గుర్తుచేసింది. అయితే వీరి వాదనను కోర్టు తోసిపుచ్చింది. కచ్చితంగా వారికి గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంటుందని, ఎంత ఇవ్వాలనే ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది. ఈ కమిటీలో కేంద్ర క్రీడాశాఖ కార్యదర్శిని కూడా చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. లోధా ప్యానెల్‌ సూచనల అమల్లో నిర్లక్ష్యం వహించినందుకు బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అనురాగ్‌ ఠాకూర్, కార్యదర్శి అజయ్‌ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీం కోర్టు గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో బోర్డు పాలన సజావుగా నడిచేందుకు కొందరి పేర్లను సూచించాల్సిందిగా కోర్టు కోరింది. ఈనెల 24న అమికస్‌ క్యూరీ గోపాల్‌ సుబ్రమణియమ్, అనిల్‌ దివాన్‌ సూచించిన తొమ్మిది మంది సభ్యుల జాబితా కోర్టుకు అందించగా వీటిని తిరస్కరించింది. మరోసారి పేర్లను సూచించాల్సిందిగా ఆదేశించి ఈనెల 30కి విచారణను వాయిదా వేసింది.

ఐసీసీ సమావేశానికి అమితాబ్, విక్రమ్‌
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో బోర్డు తరఫున ప్రాతినిధ్యం వహించే వారి పేర్లను కూడా కోర్టు ప్రకటించింది. ఫిబ్రవరి 2న దుబాయ్‌లో జరిగే ఈ మీటింగ్‌కు బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, విక్రమ్‌ లిమాయే హాజరవనున్నారు.

మరిన్ని వార్తలు