మరికొంత సమయం...

23 Jul, 2020 03:12 IST|Sakshi

గంగూలీ, జై షా పదవీ కాలం కేసు

రెండు వారాలు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: తమ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం పొడిగింపు అంశంపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఈ అంశంపై తగిన మార్గనిర్దేశనం చేయాలంటూ నిబంధనల్లో మార్పులు కోరుతూ బీసీసీఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు బుధవారం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. స్వల్ప వాదన అనంతరం విచారణను రెండు వారాలపాటు వాయిదా వేస్తున్నట్లు చీఫ్‌ జస్టిస్‌ శరద్‌ బాబ్డే, జస్టిస్‌ లావు నాగేశ్వరరావులతో కూడిన ద్విసభ్య బెంచ్‌ ప్రకటించింది. కచ్చితమైన తేదీ ప్రకటింకపోయినా... దీనిపై ఆగస్టు 17న మళ్లీ విచారణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో బోర్డు అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, కార్యదర్శి జై షా ఎప్పటిలాగే తమ విధులకు హాజరవుతారని తెలుస్తోంది.

నేపథ్యమిదీ...
బీసీసీఐ పరిపాలనలో మార్పుల కోసం నియమించిన లోధా కమిటీ గతంలో పలు సిఫారసులు చేసింది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు వీటిలో రెండు అంశాలకు చిన్న సవరణలు చేస్తూ... ఇవి మినహా మిగిలిన అన్నింటినీ బోర్డుతో పాటు అనుబంధ రాష్ట్ర క్రికెట్‌ సంఘాలు అమలు చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు 2018 ఆగస్టులో దీనికి ఆమోద ముద్ర వేసింది. ఆ సమయంలో వీటిని అమలు చేస్తామంటూ బీసీసీఐ తమ నియమావళిని కూడా సవరించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో తమ నియమావళిలో మళ్లీ సవరణలు చేసేందుకు అనుమతించాలంటూ సుప్రీంకోర్టును బీసీసీఐ ఆశ్రయించింది. గత డిసెంబర్‌ నుంచి రెండుసార్లు పిటిషన్‌ దాఖలు చేసింది.

ప్రస్తుత సమస్య ఏమిటంటే...
సుప్రీంకోర్టును బీసీసీఐ కోరుతున్న ప్రధాన అంశం ‘కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌’ గురించి. నిబంధనల ప్రకారం బీసీసీఐలోగానీ రాష్ట్ర క్రికెట్‌ సంఘాల్లోగానీ వరుసగా ఆరేళ్లు ఆఫీస్‌ బేరర్‌గా పని చేసినవారు ఆ తర్వాత కనీసం మూడేళ్లపాటు ఎలాంటి పదవులు తీసుకోకుండా విరామం ఇవ్వాల్సి ఉంటుంది. అటు సౌరవ్‌ గంగూలీ (బెంగాల్‌), ఇటు జై షా (గుజరాత్‌) కూడా బీసీసీఐ పదవుల్లోకి రాకముందే రాష్ట్ర సంఘాల్లో బాధ్యతలు నిర్వహించారు. ఈ రకంగా వారు ఆరేళ్లు పూర్తి చేసుకున్నారు. గత నెలలోనే జై షా పదవీ కాలం ముగియగా, ఈ నెల 27తో గంగూలీ సమయం కూడా ముగుస్తుంది. అయితే ఇలా తప్పుకోవడం వీరిద్దరికీ ఇష్టం లేదు.

దాంతో బోర్డు నియమావళినే మార్చేసి పదవుల్లో కొనసాగాలని వీరు భావిస్తున్నారు. అందుకోసమే మార్పులు చేసుకునే అనుమతి ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు గడప తొక్కారు. అయితే అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు ఇంకా రాలేదంటూ వీరు బోర్డు కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూనే ఉన్నారు. గత అక్టోబరులో గంగూలీ, జై షా ఎంపికయ్యారు. ప్రస్తుత నిబంధన ప్రకారం వీరిద్దరు బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు అనర్హులవుతారు. అయితే గడువు ముగిసినా వీరిద్దరు ఇప్పటికే పలు సమావేశాల్లో, ఐసీసీ ప్రతినిధులుగా కూడా హాజరవుతున్నారు. వచ్చేవారం ఐపీఎల్‌ కౌన్సిల్‌ సమావేశంలో కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇది ఎప్పటి వరకు సాగుతుందనేది చూడాలి.

మరిన్ని వార్తలు