నాకు కూడా అవకాశం ఇవ్వండి బాస్‌: రైనా

27 Sep, 2019 11:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల మోకాలికి సర్జరీ చేయించుకున్న టీమిండియా సీనియర్‌ ఆటగాడు సురేశ్‌ రైనా తన పునరాగమనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. దేశవాళీ టోర్నీలో సత్తాచాటి భారత క్రికెట్‌ జట్టులో మళ్లీ చోటు దక్కించుకోవడంపై దృష్టిపెట్టాడు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారి కనిపించిన రైనా.. భారత జట్టులో  రీ ఎంట్రీపై ఆశల్ని ఇంకా వదులుకోలేదు. వచ్చే ఏడాది, ఆ మరుసటి ఏడాదిలు వరుసగా జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఆడటమే తన ముందున్న లక్ష్యమని తాజాగా రైనా వెల్లడించాడు.

ఈ క్రమంలోనే భారత​ జట్టు ఎంతో కాలంగా అన్వేషిస్తున్న నంబర్‌-4లో తనను పరీక్షించాలని కోరుతున్నాడు. ‘నేను నంబర్‌-4లో ఆడగలను. గతంలో ఈ స్థానంలో నాకు ఆడిన అనుభవం ఉంది. 2020,2021ల్లో జరగబోయే టీ20 వరల్డ్‌కప్‌లో అవకాశం ఎదురుచూస్తున్నా’ అని రైనా పేర్కొన్నాడు.భారత క్రికెట్‌  జట్టు గత రెండేళ్లుగా నాల్గో స్థానం కోసం తీవ్ర అన్వేషణ చేస్తోంది. అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌, రిషభ్‌ పంత్‌లను ఇప్పటికే ఈ స్థానంలో పంపినా వారు పెద్దగా సక్సెస్‌ కాలేదు. దాంతో టీమిండియా పరిస్థితి మళ్ల మొదటకొచ్చింది. 

ప్రస్తుతం నాల్గో స్థానంలో రిషభ్‌. శ్రేయస్‌లను మార్చి మార్చి పంపుతున్నారు. ఈ తరుణంలో తనకు ఒక అవకాశం ఇచ్చి చూడాలని రైనా అంటున్నాడు. ఒకవేళ రైనాను వచ్చే వరల్డ్‌ టీ20 జట్టులో వేసుకోవాలంటే దేశవాళీ టోర్నీల్లో ముందుగా నిరూపించుకోవాలి. దాంతో పాటు యో-యో టెస్టును  కూడా 32 ఏళ్ల రైనా పాస్‌ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకూ వన్డేల్లో 5,615 పరుగులు చేసిన రైనా.. అంతర్జాతీయ టీ20ల్లో 1,605 పరుగులు చేశాడు. గతంలో స్టార్‌ ప్లేయర్‌గా వెలుగొందిన రైనా.. తన సహజ సిద్ధమైన ఆటను  ఆడటంలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు. దాన్ని  తిరిగి పట్టుకోవడానికి యత్నిస్తున్నా రైనాను గాయాలు వేధిస్తున్నాయి.

మరిన్ని వార్తలు