క్రికెటర్ ఎస్ యాదవ్ అరుదైన ఘనత

10 Jan, 2017 14:55 IST|Sakshi
సూర్యకుమార్ యాదవ్(ఫైల్ ఫోటో)

ఇండోర్: ముంబై ఆటగాడు సూర్యకుమార్ యాదవ్  అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా మంగళవారం  ఇక్కడ గుజరాత్తో ఆరంభమైన తుది పోరులో సూర్య కుమార్ యాదవ్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో నాలుగు వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా అతని ఫస్ట్ క్లాస్ అరంగేట్రం తరువాత ఈ మార్కును చేరిన ఏకైక ముంబై ఆటగాడిగా నిలిచాడు. 2010లో సూర్య కుమార్ యాదవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి ప్రవేశించాడు. అతని తరువాత కరుణ్ నాయర్(3,265) రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్(57) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముంబై వరుస వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో సూర్యకుమార్ యాదవ్ ఆదుకున్నాడు. అతనికి జతగా పృథ్వీ షా(71) రాణించడంతో ముంబై తేరుకుంది.


ఇదిలా ఉంచితే, రంజీ ఫైనల్లో గెలిచి కొత్త చరిత్ర సృష్టించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. 1950–51లో  గుజరాత్ జట్టు రంజీ ఫైనల్‌కు చేరినా తమ కలను నెరవేర్చుకోలేకపోయింది. అప్పటి నుంచి కనీసం రన్నరప్‌గా నిలిచే అవకాశం కూడా దక్కలేదు. 65 ఏళ్ల అనంతరం ఈసారి తమ క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయ విజయం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇక  డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగుతోంది. 45 సార్లు ఈ జట్టు రంజీ ఫైనల్లోకి రాగా... ఏకంగా 41 సార్లు విజేతగా నిలిచింది.

మరిన్ని వార్తలు