ప్రమాదంలో స్విమ్మర్‌ బాలకృష్ణన్‌ మృతి

16 May, 2019 10:12 IST|Sakshi

చెన్నై: దక్షిణాసియా క్రీడల్లో పతకం సాధించిన యువ స్విమ్మర్‌ ఎంబీ బాలకృష్ణన్‌ మృతి చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 29 ఏళ్ల స్విమ్మర్‌ అక్కడికక్కడే కన్నుమూశాడు. ద్విచక్రవాహనంపై తన ఇంటికి వెళ్తున్న సమయంలో బాలకృష్ణన్‌ ముందున్న లారీని ఢీకొట్టాడు. బండిపై అదుపు కోల్పోయిన అతను లారీ టైర్ల కింద పడటంతో దుర్మరణం పాలయ్యాడు. చెన్నైలోని గిండీ ఇంజినీరింగ్‌ కాలేజి విద్యార్థి అయిన అతను అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే స్థిరపడ్డాడు.

కొన్నిరోజుల క్రితమే ఇండియాకు వచ్చిన బాలకృష్ణన్‌ రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. 2007లో గువాహటిలో జరిగిన జాతీయ స్విమ్మింగ్‌లో స్వర్ణంతో పాటు, 2010 సీనియర్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌ (ఢిల్లీ)లో 50మీ. బ్యాక్‌స్ట్రోక్‌ విభాగంలో జాతీయ రికార్డును నెలకొల్పాడు. అదే ఏడాది దక్షిణాసియా క్రీడల్లో 100మీ., 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లలో పసిడి పతకాలను సాధించాడు. అతని మృతి పట్ల కోచ్‌ టి. చంద్రశేఖరన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. 

మరిన్ని వార్తలు