‘ఆ కోచ్‌కు ఎక్కడా జాబ్‌ ఇవ్వొద్దు’

5 Sep, 2019 13:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ఓ మైనర్‌ గర్ల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గోవా స్మిమ్మింగ్‌ కోచ్‌ సురజిత్‌ గంగూలీపై వేటు పడింది. తనపై సురజిత్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మైనర్‌ బాలిక ఫిర్యాదుకు కేంద్ర క్రీడామంత్రి కిరణ్‌ రిజుజు స్పందించారు. అతనిపై చర్యలకు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు రిజుజు ఆమెకు హామీ ఇచ్చారు. అదే సమయంలో సురజిత్‌కు భారత్‌లో ఎక్కడా కూడా స్విమ్మింగ్‌ కోచ్‌గా పదవి ఇవ్వొద్దంటూ స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇప్పటికే గోవా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అతని కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. దేశంలో ఎక్కడా అతనికి ఉద్యోగం లేకుండా స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.  ఇది అన్ని ఫెడరేషన్లకు వర్తిస్తుంది. క్రమశిక్షణా నియమావళిని ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదు’ అని రిజుజు తన ట్వీటర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు.

రెండున్నరేళ్ల క్రితం సురజిత్‌ గంగూలీని స్విమ్మింగ్‌ కోచ్‌గా గోవా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ నియమించింది. సురజిత్‌కు మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న కారణంగానే అతన్ని కోచ్‌గా ఎంపిక చేశారు. అంతర్జాతీయ స్విమ్మింగ్‌ పోటీల్లో సురజిత్‌ 12 పతకాలు సాధించారు. 1984లో హాంకాంగ్‌లో జరిగిన ఆసియా స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో సురజిత్‌ తొలి పతకం గెలుచుకున్నారు. అయితే తాజాగా మైనర్‌ బాలికపై సురజిత్‌ లైంగిక వేధింపులకు పాల్పడటంతో అతనిపై వేటు పడింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో సురజిత్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు.

మరిన్ని వార్తలు